అల్పాహారంగా రాగిజావా.. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Vinod kumar |
Minister Sabitha Indra Reddy  Reacts Over Basara IIIT Food Poison Incident
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పహారంగా రాగిజావా ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలోని కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 20న విద్యా దినోత్సవం రోజున కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి రోజూ ప్రార్థనా సమయానికి ముందు విద్యార్థులకు 250 మిల్లీ లీటర్ల రాగిజావను అందించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25.26లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. జూన్ 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కింద 1000 ప్రభుత్వ పాఠశాలలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని వెల్లడించారు.

ఇదిలా ఉండగా 1 నుంచి 5వ తరగతి చదువుతున్న 16.27 లక్షల మందికిపైగా విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్ బుక్స్, 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 12.39 లక్షల మంది విద్యార్థులకు సబ్జెక్టు ఒక్కో నోట్‌ పుస్తకం చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు, సమాచార బదలాయింపు కోసం రాష్ట్రంలోని 20వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్ లను అందించనున్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని 1,600 పాఠశాలల్లో నిర్మించిన 4,800 డిజిటల్ తరగతులను విద్యా దినోత్సవం ప్రారంభించించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సభలు, సమావేశాలను నిర్వహించి రాష్ట్రంలో విద్యారంగంలో సాధించిన విజయాలను వివరించాలని సూచించారు. అలాగే 10వేల గ్రంథాలయాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రూ.190 కోట్లు ఖర్చు చేసి 30లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించామని మంత్రి తెలిపారు. 26లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచ్చించి ఒక్కో విద్యార్థికి రెండేసి జతల యూనిఫామ్‌ను అందిస్తున్నామని మంత్రి వివరించారు. సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story