'మంత్రి కేటీఆర్ చేనేత పై అసత్య ప్రచారం'

by samatah |   ( Updated:2023-02-11 15:52:27.0  )
మంత్రి కేటీఆర్ చేనేత పై అసత్య ప్రచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ చేనేత రంగానికి ఎన్నో సంస్కరణలు చేశమని అసత్యాలు చెబుతున్నారని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ ఆరోపించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగాన్ని సర్వ నాశనం చేశాయని, తెలంగాణ ఏర్పాటు తర్వాత 9 ఏండ్లలో ఎన్నడూలేని విధంగా చేనేత రంగం నేడు నష్టపోయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం నిర్వహించి గుర్తింపు తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. మోడీ స్వదేశంలో అయినా, విదేశాలకు వెళ్లినా, ఎవరిని కలిసినా పోచంపల్లి వస్త్రాలను వారికి అందించి ఖ్యాతిని పెంచుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చేనేత మిత్ర వట్టి బూటకమని విమర్శించారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కసారి 40 శాతం సబ్సిడీ ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం ప్రతి 45 రోజులకు 15 శాతం సబ్సిడీ అందిస్తోందని వెల్లడించారు. టెస్కో‌ను నిర్వీర్యం చేసిన ఘనత మంత్రి కేటీఆర్ దేనని తేల్చి చెప్పారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. కార్పొరేషన్‌కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడంతో టెక్స్ టైల్ పార్కులు మూతబడుతున్నాయని మండిపడ్డారు.

Advertisement

Next Story