ప్రజలను చంపుతున్న వారికి బీజేపీ అండ: ఒవైసీ

by GSrikanth |
ప్రజలను చంపుతున్న వారికి బీజేపీ అండ: ఒవైసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలోని భివానీ జిల్లాలో జునైద్, నసీర్‌ల హత్య ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. గో రక్షకులు అనే ముసుగులో ప్రజలను చంపి, దోపిడీకి పాల్పడుతున్న వారిని బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. భివానీ జిల్లా బార్వాన్ గ్రామంలో కాలిపోయిన ఓ బొలేరో వాహనంలో రెండు మగ అస్థిపంజరాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన వ్యక్తులు రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాకు చెందిన జనైద్, నసీర్ లుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరి హత్య వెనుక గో రక్షకుల హస్తం ఉందని అసదుద్దీన్ ఆరోపించారు.

ఈ దారుణాన్ని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం వెనుకేసుకొస్తోందని ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గో రక్షకుల అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారని వీరికి బీజేపీ-ఆర్ఎస్ఎస్ అండ ఉందని ఆరోపించారు. ఇలాంటి వారిని బీజేపీ ప్రోత్సహించడం మానేయాలన్నారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ సైతం రియాక్ట్ అయింది. భివానీ ఘటన తీవ్రమైన సమస్య అని, హర్యానాలో శాంతిభద్రతలు లేవని ఈ ఘటన నిరూపిస్తోందని హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story