- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రానున్న పాతికేళ్ళ అవసరాలే ప్రాతిపదికగా మెగా మాస్టర్ ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మించడం కోసం త్వరలోనే మెగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అర్బన్, సెమీ-అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజిస్తూ 2050 విజన్ లక్ష్యంగా ఈ ప్లాన్ రూపొందుతుందన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి టెండర్ ప్రాసెస్‌ను మొదలు పెడతామన్నారు. ఆసక్తి కలిగిన బిల్డర్లు ఇందులో పాల్గొనవచ్చన్నారు. నగరంలో శనివారం రాత్రి జరిగిన అఖిల భారత బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్‌కు చీఫ్ గెస్టుగా హాజరైన సీఎం రేవంత్ పై అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశాన్నిగానీ, రాష్ట్రాన్నిగానీ అభివృద్ధి పథంలో నడిపించడంలో బిల్డర్స్ పాత్ర ఉన్నదని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలోనూ ఆ రంగానికి ప్రత్యేక స్థానమున్నదన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఈ అంశాన్ని చెప్పడానికే ఈ కన్వెన్షన్‌కు హాజరయ్యామన్నారు.
రియల్ ఎస్టేట్ రంగం, బిల్డర్స్ విభాగం బలపడితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే అంశంలో ఎలాంటి సందేహం లేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. సిటీలో ఉన్న ఔటర్ రింగురోడ్డు లోపలివైపు మొత్తం అర్బన్‌గా, ఔటర్ నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, రీజినల్ వెలుపల మొత్తం రూరల్ క్లస్టర్‌గా మెగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటిగా ఉన్నదని, ఈ సిటీకి మూసీ నది ఒక పెద్ద అసెట్ అని, అందువల్లనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. థేమ్స్, సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలోనే మూసీని కూడా డెవలప్ చేయాలన్నది ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదన్నారు.
సిటీ లైఫ్‌కు మూసీ లైఫ్ లైన్ :
మూసీ నదికి గతంలో వరదలు వచ్చి వేలాది మంది చనిపోతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గైడెన్సు మేరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వచ్చాయని సీఎం రేవంత్ గుర్తుచేశారు. సిటీలో గొలుసుకట్టు చెరువులూ అందుకోసమేనన్నారు. అందుకే హైదరాబాద్‌కు లేక్ సిటీ అనే గుర్తింపు కూడా వచ్చిందన్నారు. సిటీకి చార్మినార్ తలమానికం అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ, మెడికల్ కాలేజీ లాంటి చాలా లాండ్ మార్క్స్ గుర్తింపు కేంద్రాలని పేర్కొన్నారు. ఇలాంటి హెరిటేజ్ నిర్మాణాలన్నీ బిల్డర్స్ సృష్టించినవేనన్నారు. ప్రపంచంలో ఈఫిల్ టవర్, ఐకనిక్ బ్రిడ్జీలు, గేట్ వే ఆఫ్ ఇండియా.. ఇవన్నీ బిల్డర్లు నిర్మించినవేనని గుర్తుచేశారు. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, చరిత్రను నిర్మించింది బిల్డర్లేనని వ్యాఖ్యానించారు.
సిటీ అభివృద్ధిలో భాగమైన ఆనాటి మూసీ ఇప్పుడు ఒక అసెట్‌గా మారిందని, దీనికి పునర్ వైభవం చేయడానికి, పునరుద్ధరించడానికి బృహత్తరమైన ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. విజన్ పాలసీని తేవాలనుకుంటున్నామని, ఇందులో ఇక్కడున్న బిల్డర్లు కూడా భాగస్వాములు కావచ్చన్నారు. సిటీని పునర్ నిర్మించుకుంటేనే భవిష్యత్తు అని, అందుకు మూసీ కీలకమైన ప్రాజెక్టు అని వివరించారు. కార్పొరేట్ కంపెనీలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలను సృష్టించడం, ఇన్ఫోటైన్‌మెంట్ విధానాలకు మూసీ డెవప్‌మెంట్ కీలకమన్నారు. బిల్డర్లుగా వారివారి అనుభవాలను సిటీ, స్టేట్, మూసీ డెవలప్‌మెంట్‌కు వినియోగించాలని కోరారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్లు భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరుకుంటున్నదన్నారు. బిల్డర్ల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకే ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నామన్నారు.
బూర్గుల తర్వాత నేను :
హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సీఎం అయిన బూర్గుల రామకృష్ణారావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తేనని, సౌత్ ఇండియా నుంచి ఎన్నికైన ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్‌రెడ్డి కూడా ఈ జిల్లాకు చెందినవారేనని గుర్తుచేసిన సీఎం రేవంత్‌రెడ్డి... ఇదే జిల్లాకు చెందిన తాను రెండో సీఎంను అయ్యానని పేర్కొన్నారు. పాలమూరు ప్రజలు తట్టలు మోసినందునే ఇక్కడున్న బిల్డర్లలో పలువురు ఆగర్భ శ్రీమంతులయ్యారని అన్నారు. పాలమూరు పదం అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడి మట్టి వాసన తనకు చాలా స్ఫూర్తినిస్తుందన్నారు. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణ బాధ్యతను తన మంత్రివర్గ సహచరులు తనకు అప్పజెప్పారని, ఈ బాధ్యతను తప్పకుండా తీసుకుంటానన్నారు.