అధికారులు కబ్జా అని కూల్చారు.. అక్రమార్కులు దర్జాగా మళ్లీ కట్టారు..

by Sridhar Babu |   ( Updated:2025-03-18 12:39:01.0  )
అధికారులు కబ్జా అని కూల్చారు.. అక్రమార్కులు దర్జాగా మళ్లీ కట్టారు..
X

దిశ, దుండిగల్ : అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా కరిగి పోతున్నాయి. ప్రభుత్వ భూమైనా, ప్రజాప్రయోజన స్థలమైనా కబ్జాదారులు వదలడం లేదు. రహదారులను సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటే కబ్జాదారుల తీరు ఏపాటిదో ఇట్టే అర్ధమవుతుంది.

దుండిగల్ మండల పరిధిలోని సర్వే నంబర్ 120 డాక్టర్ బస్తి వీకర్ సెక్షన్ కాలనీలో రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపడితే స్థానికుల ఫిర్యాదు మేరకు గతంలో కూల్చివేశారు. కూల్చిన చోటే రాత్రికి రాత్రి రెండు రూములు, ఒక ప్రహరీ గోడ నిర్మించినా కాని రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కాసులకు కక్కుర్తి పడుతున్న రెవెన్యూ అధికారులు పరోక్షంగా కబ్జాదారులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు

రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఫిర్యాదుల ఆధారంగా స్పందించిన రెవెన్యూ అధికారులు నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. కూల్చిన చోట రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే గత ఐదు నెలల నుండి అక్రమనిర్మాణాలు జోరుగా సాగుతున్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story