పబ్ కల్చర్ పై పోలీసుల ఉక్కుపాదం..

by Sumithra |
పబ్ కల్చర్ పై పోలీసుల ఉక్కుపాదం..
X

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లిలో పబ్ కల్చర్ హద్దులు దాటుతుంది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా అసలు అనుమతులు సైతం తీసుకోకుండా విచ్చల విడిగా బార్ అండ్ రెస్టారెంట్ మాటున బాచుపల్లిలో నిర్వహిస్తున్న శ్రీనిధి డెవలపర్స్ ఆహ్లాదం పెగ్ బ్రో రెస్టారెంట్, పబ్ పై ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. చెవులు దద్దరిల్లే డీజే సౌండ్ సిస్టం, లేజర్ లైట్స్ తో పాటలు ప్లే చేస్తూ యువతీ, యువకులతో అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆహ్లాదం పెగ్ బ్రో రెస్టారెంట్ అండ్ బార్ ను గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలను హన్మంత్ రెడ్డిలతో గ్రాండ్ గా ఓపెనింగ్ చేయించారు.

ప్రభుత్వ పెద్దలే మనకు అండగా నిలబడ్డారు ఇక బార్ అని చెప్పి పబ్ కార్యకలాపాలు నడిపితే మమ్మల్ని అడ్డుకునే ధైర్యం ఎక్కడిది, ఎవ్వరికి ఉంది అని అనుకున్నారో ఏమో కానీ నిబంధనలు తుంగలో తొక్కి విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారు. డబ్బు సంపాదనే యావగా పెట్టుకున్న సదరు ఆహ్లాదం బార్ అండ్ పెగ్ బ్రో రెస్టారెంట్ విచ్చలవిడిగా విశృంఖల చేష్టలకు దిగుతూ స్థానిక పౌర సమాజానికి విఘాతం కల్గిస్తుంది. అర్ధరాత్రి మద్యం మత్తులో భారీ మ్యూజిక్ సౌండ్ లతో చిందులు వేస్తూ అసభ్య నృత్యాలకు తెరలేపారు. స్థానిక పౌరుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఆహ్లాదం బార్ అండ్ రెస్టారెంట్ పై కేసులు నమోదు చేసి మ్యూజిక్ పరికరాలు సీజ్ చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed