ప్రమాదకరంగా క్వారీ గుంతలు.. పట్టించుకోని అధికారులు..

by Disha Web Desk 23 |
ప్రమాదకరంగా క్వారీ గుంతలు..  పట్టించుకోని అధికారులు..
X

దిశ,ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ, యంనంపేట పరిధిలో ఉన్న క్వారీ గుంతలు ప్రమాదకరంగా తయారయ్యాయి. దశాబ్దాల పాటు క్వారీలు నిర్వహించుకున్న యజమానులు రూ.కోట్ల రూపాయలు సంపాదించుకొని గుంతలను పూడ్చడం మరిచిపోయారు. ఈ గుంతలు వర్షం నీటితో నిండిపోయాయి. ప్రస్తుత వేసవి తాపాన్ని తట్టుకోలేక ఈ నీటిలో చుట్టుపక్కల కాలనీ గ్రామాల వాసులు ఈతల కొడుతూ సేద తీరుతున్నారు. కానీ లోతు తెలియని గుంతలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. జిల్లా పరిధిలో ఉన్న కొన్ని క్వారీ గుంతలలో ఇటీవల కొందరు యువకులు ఈతకు వెళ్లి చనిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వరంగల్ - జాతీయ రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న ఈ క్వారీ గుంతలు ప్రమాదకరంగా తయారయ్యాయి.

స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. సాయంకాల వేళలో యువకులు ఈ క్వారీ గుంతలలోని నీళ్లలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు కూడా సమాచారం. క్వారీ గుంతల వైపు యువకులు రాకుండా రక్షణ కంచె,సూచిక బోర్డులు ఏర్పాటు చేయించాలని స్థానికులు పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించకపోవడం గమనార్హం. క్వారి గుంతల్లో ప్రమాదం జరగక ముందే ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, స్థానిక పోలీసులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed