ఒక్కరోజే వడదెబ్బతో 19 మంది మృతి

by Disha Web Desk 12 |
ఒక్కరోజే వడదెబ్బతో 19 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుండి 40 డిగ్రీల ఎండ కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మధ్యాహ్న సమయానికి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఒక్కరోజే.. వడదెబ్బ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇందులో వెల్గటూర్ ఎంఈవో భూమయ్య కూడా ఉన్నారు. అటు జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలో అత్యంత భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో 22 జిల్లాల్లో వడగాలులు వీయగా.. హైదరాబాద్ మహానగరంలో అయితే భారీ వేడికి.. గాలిలో తేమ శాతం 15కు పడిపోయింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మే నెల మొదటి వారంలోనే ఎండలు ఇలా దంచికొడితే.. రోహిని కార్తికి ఎండలు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed