MP:పేదల జోలికొస్తే ఊరుకోం

by Sridhar Babu |
MP:పేదల జోలికొస్తే ఊరుకోం
X

దిశ, దుండిగల్ : పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి పేదల పక్షాన పోరాడుతామని మల్కాజిగి ఎంపీ ఈటెల రాజేందర్ (Mp Etela Rajender) అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 453,454లో 446 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా సుమారు 355 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఐసీకి అప్పగించేందుకు శుక్రవారం సర్వే నిర్వహించడంతో అడ్డుకున్న గ్రామస్తులు శనివారం దుండిగల్ వార్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈటెల రాజేందర్ రైతుల ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అలాట్ చేసిన భూములను ఎప్పుడుపడితే అప్పుడు లాక్కునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజా అవసరాల కోసం వాడుకోవాల్సి వస్తే రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులను ఇబ్బంది పెడితే కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తామని తెలిపారు. 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇచ్చిందని, వారు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుండగా లాక్కుంటే సహించేది లేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించినప్పుడు పట్టా భూములకు పరిహారం చెల్లించిన విధంగానే అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇచ్చినట్టు గుర్తు చేశారు.

ప్రభుత్వ ఆదేశాలను పాటించక తప్పదు : తహసీల్దార్

ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా పాటించాల్సి ఉంటుందని, సర్వే నంబర్ 453,454 లోని 446 ఎకరాల్లో డబుల్ బెడ్ రూమ్స్, డంపింగ్ యార్డ్, ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 60 ఎకరాలు కేటాయించగా మిగతా భూమిని రైతుల నుంచి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని దుండిగల్ మండల తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ (Tehsildar Syed Abdul Matin)తెలిపారు.

సర్వే నంబర్ 453,454 లోని భూమి ఇప్పటికీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉందన్నారు. రైతులు సానుకూలంగా స్పందించాలన్నారు. అసైన్డ్ భూమిలో కేవలం వ్యవసాయం చేసుకోవాలి తప్పా అమ్ముకునే అధికారం లేదని గుర్తు చేశారు. సర్వే కు వెళ్లిన అధికారులు మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం గ్రామస్తులకు తగదన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే 453,454 అసైన్డ్ భూములలో త్వరలో సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed