MLA : చెరువులపై మంత్రి భట్టి తెలిపిన లెక్కలు తప్పుల తడక

by Sridhar Babu |
MLA : చెరువులపై మంత్రి భట్టి తెలిపిన లెక్కలు తప్పుల తడక
X

దిశ, కూకట్​పల్లి : హైదరాబాద్​ నగరంలో చెరువులు కబ్జాకు గురయ్యాయని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (MLA Madhavaram Krishna Rao)ఇటీవల నిర్వహించిన ప్రెస్​ మీట్​లో చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడక అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంత కాలంగా కాంగ్రెస్​ ప్రభుత్వం హైదరాబాద్​ ప్రజలను హైడ్రా (Hydra)పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తుందని, గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నగరంలోని అన్ని చెరువుల వివరాలు ప్రకటిస్తూ వాటిని నెట్​లో పొందు పరిచారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి తెలిపిన వివరాలు అన్నీ తప్పుల తడక అని ఆరోపించారు.

కూకట్​పల్లి నియోజకవర్గంలో ఉన్న బోయిన్​ చెరువు, ఖాజాకుంట చెరువు, నల్ల చెరువు, మైసమ్మ చెరువు, కాముని చెరువు, ముళ్లకత్వ చెరువు, సున్నం చెరువు, రంగధాముని చెరువుల పూర్వి వివరాల గురించి ఆర్​టీఐ ప్రకారం అధికారులను సమాచారం అడిగినట్టు తెలిపారు. వారు ఆర్​టీఐ ద్వారా ఇచ్చిన సమాచారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రెస్​ మీట్​లో ఇచ్చిన వివరాలకు పొంతన లేదని అన్నారు. సీనియర్​ నాయకులు, మంత్రి హోదాలో ఉన్న భట్టి విక్రమార్క అధికారులను సంప్రదించి వారి నుంచి పూర్తి సమాచారం తీసుకుని ప్రెస్​ మీట్​ పెట్టాలి కానీ తప్పుల తడకగా ఉన్న వివరాలను బయట పెట్టి ప్రజలను భయపెట్టడం సమంజసం కాదని అన్నారు.

అసలు రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించిన సబ్జెక్ట్​ను ఆర్థిక శాఖ మంత్రి వివరించడం ఏంటో వారికే తెలియాలని విమర్శించారు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే చెరువులు కబ్జాకు గురయ్యాయని, కాలనీలు ఏర్పడ్డాయని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువుల వద్ద అదే పరిస్థితి ఉందని అన్నారు. చెరువుల వద్ద హైడ్రా పేరుతో జరిపిన కూల్చి వేతలు ఎఫ్​టీఎల్​లో నిర్మించుకున్నవి కావని, బఫర్​ జోన్​లో నిర్మించుకున్న వాటిని కూల్చి ప్రజలను భయ పెడుతున్నారని అన్నారు.

ఆకాశంలో, గూగుల్​ ద్వారా కాకుండా భూమి మీద సర్వేలు నిర్వహిస్తే నిజానిజాలు బయట పడతాయని సూచించారు. ఆర్​టీఐ ద్వారా కూకట్​పల్లి చెరువులకు సంబంధించి సేకరించిన వివరాలను అసెంబ్లి స్పీకర్​, ప్రభుత్వానికి అందజేస్తానని అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల వద్ద ప్రజలను భయపెట్టడం కాకుండా అభివృద్ధి చేయాలని, చెరువులో పట్టా భూములు ఉన్న వారికి నష్టపరిహారం చెల్లించి, ఆ భూములను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed