వాడివేడిగా మేడ్చల్ సర్వసభ్య సమావేశం..

by Kalyani |
వాడివేడిగా మేడ్చల్ సర్వసభ్య సమావేశం..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు.. గ్రామ పంచాయతీలలో అక్రమ నిర్మాణాలు.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ.. సర్కారు దవాఖానలలో అసౌకర్యాలు.. ఫించన్ల మంజూరులో లోపాలపై మేడ్చల్ జిల్లా జడ్పీ సర్వ సభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. బుధవారం మేడ్చల్ లోని జిల్లాపరిషత్ సర్వ సభ్య సమావేశం జడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, సీఈఓ దేవ సహాయం, కాంగ్రెస్ పార్టీ జడ్పీ ప్లోర్ లీడర్ హరివర్దన్ రెడ్డి, ఎంపీపీలు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎల్లుబాయి, ఇందిరా, కో అప్షన్ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

40వేలకు 4 వేలు మాత్రమేనా..

జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు కేటాయించడం లేదని, ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు..? ఎన్ని లబ్దిదారులకు కేటాయించారని కాంగ్రెస్ జడ్పీ ప్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ ఇండ్లను జీహెచ్ఎంసీ పరిధిలో నివసించే వారికి కేటాయిస్తున్నట్లు తెలిసింది. అలా ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ.. వాటిని స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తన కంటే ముందే గత ఎమ్మెల్యే హాయంలోనే 10 శాతం స్థానికులకు కేటాయించాలని ఒప్పందం కుదిరిందన్నారు.

ఆ ఒప్పందం ప్రకారమే మేడ్చల్ సెగ్మెంట్ లో నిర్మించిన 40 వేల ఇళ్లకు గాను 4వేల ఇళ్లను కేటాయిస్తారని వివరణ ఇచ్చారు. దీనిపై హరివర్దన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కనీసం 50 శాతం ఇండ్లనైనా కేటాయించేలా ప్రభుత్వంపై మంత్రి ఒత్తిడి తీసుకురావాలని కోరారు. గత ఒప్పందాలను తానేలా కాదంటానని మంత్రి పేర్కొనడంతో హరివర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి తీరును తప్పు బట్టారు. దీనికి ఘట్ కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మద్దతు పలుకుతూ స్థానికులకు 50 శాతం వాటా ఇప్పించాలని పట్టుబట్టారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇండ్లు లేని ప్రతి పేదోళ్లకు ఇండ్లు ఇప్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నిర్మించుకున్న పేదలు, తమ ఇళ్ల స్థలాలను క్రమబద్దీకరించేందుకు జీవో 58, 59ల గడువును మరో నెల రోజులపాటు పెంచినట్లు తెలిపారు.

అదేవిధంగా ఇదే నెలలో ఇంటి స్థలం ఉన్న వారికి రూ. 3 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. దీనిపై హరివర్దన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు మాట్లాడుతూ.. మంత్రి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 50 శాతం స్థానికులకే కేటాయించాలని జడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని హరివర్దన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు పట్టుబడుతూ సమావేశంలోనే నేలపై బైఠాయించారు. మంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రికత్తత నెలకొంది. పోలీసులు వారిని సముదాయించి, వారి వారి స్థానాల్లో కూర్చోబెట్టారు.

ఆక్రమణలపై వాడివేడిగా..

గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.పేదోళ్లు చిన్న ఇంటిని నిర్మించినా.. కూల్చేస్తున్నారు. బడాబాబులు కన్వర్ జేషన్ జోన్లలో వందల ఎకరాల్లో లే అవుట్ వేసినా.. అక్రమంగా భవనాలను నిర్మించినా పట్టించుకోవడంలేదు. జిల్లా పంచాయతీ అధికారులు, కార్యదర్శులు అక్రమ నిర్మాణాలను కట్టడి చేయలేకపోతున్నారని, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, జడ్పీటీసీ హరివర్దన్ రెడ్డిలు ఆరోపించారు. కొందరు సర్పంచ్ లపై డీపీఓ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. శామీర్ పేట బీఆర్ఎస్ ఎంపీపీ ఎల్లుబాయి మాట్లాడుతూ.. శామీర్ పేటలో నామో వెంచర్ గ్రామానికి వెళ్లే రోడ్డును కబ్జా చేస్తున్నారని తెలిపారు. చౌదరి గూడలో 60 పార్కులకు గాను 40 పార్కులు కబ్జాకు గురయ్యాయి. ఎదులాబాద్ కార్యదర్శి సొంత రశీదుల ద్వారా రూ. 26 లక్షలు వసూలు చేసినా, కార్యదర్శిపై నామామాత్రపు చర్యలతోనే సరిపెట్టారు.

ఎంపీపీని విచారణ అధికారిగా నియమించడం ఎంత వరకు కరెక్ట్ అని సుదర్శన్ రెడ్డి నిలదీశారు. గౌడవెల్లి సర్పంచ్ పై డీపీఓ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. తరచూ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడు. జిల్లాలో బోలేడంత అవినితీ జరుగుతుంది. అవినీతిపై సిబీఐ చేత విచారణ జరుపాలని కోర్టును అశ్రయిస్తానని హరివర్దన్ రెడ్డి స్పష్టంచేశారు. అదేవిధంగా ఎంపీపీ ఎల్లుబాయి మాట్లాడుతూ.. తుర్క పల్లి కార్యదర్శి తప్పుడు ఇంటి నెంబర్లు ఇచ్చారని వేటు వేశారు. అదే శామీర్ పేటలోని సెలబ్రెటీ క్లబ్ లో అసలు ఇండ్లు లేని వాటికి ఇంటి నెంబర్లు ఇచ్చిన కార్యదర్శిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె అసహనం వ్యక్తంచేశారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులను ఫర్మినెంట్ చేయాలి...

కాంట్రాక్ట్ ఉద్యోగులను ఫర్మినెంట్ చేస్తానని ఇచ్చిన సీఎం కేసీఆర్ హామిని నిల బెట్టుకోవాలని, జిల్లాలో 33 జూనియర్ పంచాయతీ (కాంట్రాక్ట్ కార్యదర్శులు) కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని హరివర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో 33 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని తీర్మానం చేసి పంపుదామని హరివర్దన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి తోసిపుచ్చారు. ప్రభుత్వ వైద్యం పేదలకు అందడంలేదని, సర్కారు దవాఖానలలో సరైన సౌకర్యాలు లేవన్నారు.

ఎదులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ కిట్ రాక ఏడాదిన్నర అవుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో నిధులు లేవు. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతున్నాం. ఈ రెండేళ్లలో జరిగిన అవినీతిని తానేన్నడు చూడలేదని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి, వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ లు రాకపోవడంతో పైన చర్చించిన అంశాలపై మరోసారి ప్రత్యేకంగా సమావేశమవుదామని, ఆ సమావేశాల్లో అన్ని విషయాలు చర్చిద్దామని కలెక్టర్ అమోయ్ సూచించారు.

తూతూ మంత్రంగా ప్రజావాణి..

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెడుతున్నారు. తూతూ మంత్రంగా ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులేన్ని...? ఎన్నింటిని పరిష్కంచారు. వేలల్లో దరఖాస్తులు పేరుకుపోయినట్లు తెలిసింది. ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లుదామని కలెక్టరేట్ ఆపీసుకు వస్తే.. ప్రజాప్రతినిధులకు కలెక్టర్ సమయం ఇవ్వడం లేదని హరివర్దన్ రెడ్డి, ఎల్లుభాయి, సుదర్శన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ధరణి సమస్య తీరాలంటే కలెక్టర్ చేతిలోనే ఉంది.

తహసీల్దార్లు, ఆర్డీవోల వల్ల పనులు కావడం లేదన్నారు. దీనిపై కలెక్టర్ వివరణ ఇస్తూ.. తాను ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు సమయం ఇస్తున్నానని, ఆ సమయంలో వచ్చి కలువాలని సూచించారు. 57 ఏళ్లలోపు వయస్సు వారికి ప్రభుత్వం ఫించన్లను ఇస్తామని చాలా మందికి ఇవ్వడంలేదని, జిల్లాలో ఎంతమందికి ఫించన్లు ఇస్తున్నారు. ఎన్ని ఫించన్లు మంజూరు అయ్యాయే వివరాలు ఇవ్వాలని హరివర్దన్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story