ఎల్ఆర్ఎస్ వేగవంతం..ఇందిరమ్మ ఇళ్ల కమిటీలపై కసరత్తు : మేడ్చల్ అదనపు కలెక్టర్

by Aamani |
ఎల్ఆర్ఎస్ వేగవంతం..ఇందిరమ్మ ఇళ్ల కమిటీలపై కసరత్తు : మేడ్చల్ అదనపు కలెక్టర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : లే అవుట్ల క్రమ బద్దీకరణ పథకం ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధికా గుప్తా తెలిపారు.దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాధికా గుప్తా మీడియాతో మాట్లాడారు..జిల్లాలో రూ.ఒక లక్షా 20 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా..3 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎల్ఆర్ఎస్ కింద అందిన దరఖాస్తుల్లో ..దాదాపు 75 శాతం అప్లికేషన్లలో పూర్తి వివరాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు అవసరమైన పత్రాలను మళ్లీ అప్ లోడ్ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపారు.దరఖాస్తు దారులు తమ మొబైల్ నెంబర్, అడ్రస్ లేదా ఇతర వివరాలను ..సెల్ ఫోన్ వచ్చే ఓటీపీ ద్వారా సవరించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే.. వాటిని తీర్చుకునేందుకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘హెల్ప్ డెస్క్ ’లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఎల్ఆర్ఎస్ పైన ఏమైనా సందేహాలు ఉన్నవారు ఈ కేంద్రాలను సంప్రదిస్తే సరిపోతుందని అదనపు కలెక్టర్ రాధికా గుప్తా తెలియజేశారు. ఆదివారం కూడా హెల్ప్ డెస్క్ లు పనిచేస్తాయని స్పష్టంచేశారు.

ఇందిరమ్మ ఇళ్లకి కమిటీలు..

జిల్లాలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాధికా గుప్తా తెలిపారు.లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలలో కమిటీల నియామకానికి పేర్లను పంపాలని ఆయా మున్సిపల్ కమీషనర్లకు, 34 గ్రామ పంచాయితీలలో కమిటీల కోసం ఎంపీడివోలను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో స్పెషల్ ఆఫీసర్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారని, స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారని అన్నారు. ఈ ముగ్గురిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు తప్పక సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి కన్వీనర్ గా ఉంటారు. మున్సిపాలిటీల్లో వార్డుల/డివిజన్ల వారీగా కమిటీలు ఉండనున్నాయి. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురిలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఇద్దరు తప్పనిసరిగా ఉండాలి. వార్డు ఆఫీసర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.

చెరువుల హద్దుల సర్వే..

జిల్లా వ్యాప్తంగా 620 చెరువులు ఉన్నట్లు అదనపు కలెక్టర్ రాధికా గుప్తా వెల్లడించారు.వీటిలో 97 చెరువులకు హద్దులను నిర్ణయించినట్లు నోటిఫై చేసినట్లు తెలిపారు. మరో 110 చెరువులకు సంబంధించి హద్దులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మిగతా 413 చెరువుల హద్దులను గుర్తించేందుకు రెవెన్యూ సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారులు ప్రస్తుతం డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(డీజీపీఎస్) యంత్రాల సహాయంతో సర్వే చేస్తున్నట్లు తెలిపారు. చెరువుల సరిహద్దులు, నీటి మట్టాల స్థాయి, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి 2,3 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు..

జిల్లాలో మున్సిపాలిటీలలో విలీనం కానీ 34 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు రాధికా గుప్తా తెలిపారు.ఈ గ్రామాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తామని గానీ, ఎన్నికలు నిర్వహించ బోమని గానీ ఇంతవరకు జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం పెద్దల నుంచి సమాచారం లేదన్నారు.విలీనం కానీ గ్రామాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని రాధికా గుప్తా స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed