ట్రావెల్స్​ బస్సులు తగలబెట్టింది డ్రైవరే.. కేసును ఛేదించిన కూకట్ పల్లి పోలీసులు

by Shiva |
ట్రావెల్స్​ బస్సులు తగలబెట్టింది డ్రైవరే..  కేసును ఛేదించిన కూకట్ పల్లి పోలీసులు
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లిలో 12న పార్కింగ్​లో ఉన్న ప్రైవేటు బస్సులకు నిప్పంటుకున్న కేసును కూకట్​పల్లి పోలీసులు చేధించారు. ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం కూకట్​పల్లికి చెందిన కృష్ణారెడ్డి భారతి ట్రావెల్స్ పేరుతో పది ప్రైవేటు బస్సులతో ట్రావెల్స్ బిజినెస్ ను నిర్వహిస్తున్నాడు. అతని వద్ద కృష్ణా జిల్లాకు చెందిన పసుపులేటి వీరబాబు (34) డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం 12న కృష్ణారెడ్డి డ్రైవర్ వీరబాబును డ్యూటికి వెళ్లమని చెప్పగా వీరబాబు అందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో వీరబాబు యజమాని కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో కృష్ణారెడ్డి అతని కుమారుడు యశ్వంత్ రెడ్డి వీరబాబుపై దాడి చేశారు. బస్సుకు సంబంధించిన ఫ్యాన్ బెల్టు, కొబ్బరి మట్టలతో అతడిని చితక బాదారు. దీంతో రాత్రి అతిగా మద్యం సేవించిన వీరబాబు తనపై దాడి చేసిన కృష్ణారెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవాలని సమీపంలోని పెట్రోల్ బంకులో 2లీటర్ల పెట్రోల్​ను తీసుకువచ్చి బస్సులో పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. దీంతో బస్సులో మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో రెండు పికప్ వాహనాలకు అంటుకుని మూడు వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఇదిలా ఉండగా, కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వీరబాబును కృష్ణా జిల్లాలో అదుపులో తీసుకున్నారు. కాగా, వీరబాబు ఒంటిపై గాయాలు గమనించిన పోలీసులు వీరబాబును ప్రశ్నించగా తండ్రీ, కొడుకులు తనపై దాడి చేశారనే కోపంతోనే ప్రతీకారం తీర్చుకునేందుకు బస్సుకు నిప్పంటించానని వీరబాబు ఒప్పుకున్నాడు. వీరబాబును రిమాండ్​కు తరలించిన పోలీసులు, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణారెడ్డి, యశ్వంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ సమావేశంలో సీఐ నరసింగరావు, ఎస్సై రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story