IT Raids On Malla Reddy.. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో దాడులు

by Vinod kumar |   ( Updated:2022-11-22 13:58:33.0  )
IT Raids On Malla Reddy.. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో దాడులు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: హైదరాబాద్‌‌లోని పలువురు రాజకీయ నేతలు, వ్యాపార వేత్తల పై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. తాజాగా మంగళవారం తెల్లవారు జాము నుంచి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. ఏక కాలంలో హైదరాబాద్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో మల్లారెడ్డి సంస్థలు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఐటీ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి. మల్లారెడ్డి కుమారు లు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి లు, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు తమ్ముళ్లు నర్సింహరెడ్డి, గోపాల్ రెడ్డి నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలలో 52 టీంలు పాల్గొనడం కలకలం రేపుతోంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక టీం లు రంగంలోకి దిగాయి. సోమవారం రాత్రి 8 మంది టీం హైదరాబాద్‌లో మకాం వేసినట్లు తెలిసింది. స్థానిక అధికారుల సహాయంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

మంత్రి మల్లారెడ్డి, (Minister Malla Reddy) కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లి లోని ఫామ్ వీడోస్ విల్లాలో మహేందర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. కొంపల్లి ఫామ్ విడోస్‌లో జరుగుతున్న సోదాలతో మీడియాను లోపలికి వెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతి ఇవ్వడం లేదు. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ లు, ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా, కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి లు పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టగా, వాటిల్లోనూ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ లు రియల్ ఏస్టేట్ సంస్థలకు సంబంధించిన పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాలేజీల్లో పెద్ద ఎత్తున ట్యాక్స్‌లు కట్టలేదని అంటున్నారు. సుచిత్రలోని భీమా ప్రైడ్ అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి, పైపులైన్ రోడ్డులో నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి అనుచరుడు రఘునాథరెడ్డి ఇళ్లలో రూ. రెండు కోట్ల చొప్పున మొత్తం నాలుగు కోట్ల రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సాయంత్రం 5 గంటల సమయంలో మంత్రి తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీడియా ప్రతినిధులకు అభివాదం చేసి లోపలికి వెళ్లారు.

టర్కీలో మంత్రి అల్లుడు, కూతురు..

Minister Malla Reddy అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కుమార్తె మమతారెడ్డి లు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. టర్కీ దేశంలో విహార యాత్రకు వెళ్లినట్లు మర్రి రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు తెలియజేస్తున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు బయట పడినట్లు తెలిసింది. ఆ లాకర్లను తెరిచేందుకు ఐటీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఐటీ అధికారుల తనిఖీలతో మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయం, అల్లుడి ఇళ్లు, కార్యాలయం బోసిపోయాయి.

Read more:

1.మల్లారెడ్డికి ఏమైంది..? మంత్రిని చూపించాలని TRS కార్యకర్తల ఆందోళన

Advertisement

Next Story