నిమజ్జనం వేళ జాగ్రత్త సుమా..

by Sumithra |   ( Updated:2024-09-15 11:22:12.0  )
నిమజ్జనం వేళ జాగ్రత్త సుమా..
X

దిశ, శామీర్ పేట : ఏ కార్యక్రమం చేపట్టిన ఎలాంటి విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుని వేడుకుంటాం. శుభకార్యాలు వేడుకలు జరిపేముందు తొలుత గణపతికి పూజలు నిర్వహించి సవ్యంగా జరగాలని కోరుకుంటారు. తొలి పూజలు అందుకునే గణేశుని నవరాత్రి ఉత్సవాలు ఈనెల 7 నుంచి ప్రారంభమై 16 తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. అనంతరం గణేశుని నిమజ్జనం చేయనున్నారు. ఎలాంటి అవరోధాలు లేకుండా నిమజ్జనాలు జరిగేలా ఉత్సవ సమితి సభ్యులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇతర అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని పలువురు కోరుతున్నారు. నిమజ్జనం సమయంలో చెరువుల వద్ద అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రధానంగా పోలీసులు, విద్యుత్, వైద్యం ఆరోగ్య, పురపాలక సంస్థ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను నియమించాలి.

భారీ విగ్రహాలను వాహనం పై ఎక్కించడం కష్టంతో కూడుకున్న పని. అందుకే ఎక్కువ మంది భక్తులు అవసరం అవుతారు. కాబట్టి వీలైతే చిన్నపాటి క్రేనులు అందుబాటులో ఉంటే వాటితో ఎక్కించుకోవలసి ఉంటుంది.

ప్రతి వాహనంలో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

విగ్రహాలను పట్టుకోవడం తీర్థప్రసాదాల పంపిణీ బాధ్యతలు పిల్లలకు అప్పగించరాదు. వాహనం కుదుపునకు గురైతే కిందపడే ప్రమాదం పొంచి ఉంది.

క్రేను సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఊరేగింపు సందర్భంగా సూచనలు..

స్వామివారి ఊరేగింపులో ప్రమాదకర నృత్యాలు చేయవద్దు.

డీజేలకు అతి దగ్గరగా ఉండకూడదు. భారీ శబ్దంతో గుండె లయ తప్పేప్రమాదం ఉంది.

మార్గమధ్యంలో రహదారికి అడ్డంగా కిందికి వేలాడుతూ ఉండే విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉంటుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని తెలపారు.

అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే 100, 108 కి కాల్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.

అధికారులు చేపట్టాల్సిన చర్యలు..

కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను సవరించి రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలకు తొలగించాలి.

ఇటీవల కురిసిన వర్షాలకు రహదారుల పై గుంతలు ఏర్పడి బురదగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు మరీ ఎక్కువగా ఉన్నాయి. మొరం మట్టి పోసి వాటిని చదును చేయాలి.

నిమజ్జనం చేసే చెరువులు కుంటలు వాగులు, మొదలగు వాటి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.

పోలీసుల బందోబస్తుతో పాటు గజఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చూడాలి.

లోతుగా ఉండే ప్రాంతానికి వెళ్లకుండా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి.

చిన్నపిల్లలు, యువకులను పెద్దలు కనిపెడుతూ ఉండాలి.

ఊరేగింపు సమయంలో మద్యం సేవించరాదు.

రోడ్డు పక్కన ఉండే భవనాలపై చివర్లో నిల్చొని లేదా కూర్చొని ఉత్సవాలు చూడవద్దు. కింద పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story