అధికారుల అండ.. అక్రమార్కుల దందా..!

by Sumithra |   ( Updated:2023-05-04 09:14:27.0  )
అధికారుల అండ.. అక్రమార్కుల దందా..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అక్రమార్కులకు అధికారులు అండగా నిలుస్తున్నారా...? అక్రమ నిర్మాణాలను వారే ప్రోత్సహిస్తున్నారా...? చర్యలు తీసుకోవాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా... ? కూల్చివేయకుండా అక్రమ కట్టడాలను ఏలా కాపాడుకోవాలో.. అక్రమార్కులకు వారే ఉచిత సలహా ఇస్తున్నారా..? అంటే కుత్బుల్లాపూర్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తీరును పరిశీలిస్తే నిజమేననిపిస్తోంది. ఎందుకంటే జీడీమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువుకు సంబంధించిన ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ తో సహా ప్రభుత్వ భూములను అక్రమించి భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ‘దిశ’ వరుస కథనాలతో స్పందించిన ఉన్నతాధికారులు చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసినా.. కిందిస్థాయి అధికార యంత్రాంగం మొక్కుబడిగా కూల్చివేయం పై పలు విమర్శలకు తావిస్తోంది.

ఎన్వోసీ లేదా క్రమబద్దీకరణ..

జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ స్థలాలను మింగేసేందుకు ఓ భూ కబ్జా ముఠా కాసుకోని కూర్చింది. స్థానిక ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సర్వే నెంబర్లు 36, 37, 38, 39, 44లలో ఉన్న ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ స్థలాలను అక్రమించి భారీఎత్తున అక్రమ నిర్మాణాలు, షెడ్లను కడుతోంది. సర్వే నెంబర్ 35లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తోంది. అక్రమ నిర్మాణాలు చేపట్టి జీవో 59 ద్వారా సదరు భూములను క్రమబద్దీకరించుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి తమ అధీనంలో ఉంచుకుంటే ప్రభుత్వమే 59 జీవో ద్వారా రెగ్యులరైజ్ చేస్తుందని కన్నింగ్ ఐడియాతో ఉంది. ఒకవేళ జీవో 59 ద్వారా క్రమబద్దీకరణ జరగకపోతే ప్లాన్ బీని కూడా రేడీ చేస్తోంది.

పట్టా భూములతోపాటు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ , ప్రభుత్వ భూములకు ఎన్వోసీ తీసుకునేందుకు రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకుంది. జీడీమెట్లలోని సర్వే నెంబర్లు 285, 286, 286, 287, 288, 293, 301, 304లలో ఉన్న పట్టాభూములతో పాటు సర్వే నెంబర్లు 36, 37, 38, 39, 44లలో ఉన్న బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ స్థలాలతో పాటు సర్వేనెంబర్ 35లో ఉన్న ప్రభుత్వ భూములకు నిరభ్యంతర సర్టిఫికేట్ (ఎన్వోసీ) జారీ చేయాలని రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకుంది. అయితే జిల్లాలోని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి ఈ వివాదస్పద భూములకు ఎన్వోసీ ఇచ్చేందుకు భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తూతుమంత్రంగా కూల్చివేతలు..

ఫాక్స్ సాగర్ చెరువు శిఖం భూములు కబ్జాకు గురువుతున్న విషయమై ‘దిశ’ దినపత్రికలో వస్తున్న వరుస కథనాలతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే లోకల్ అధికారులు బుధవారం సాయంత్రం తూతుమంత్రంగా కూల్చివేతలు చేపట్టారు. కూల్చి ..కూల్చనట్లు ప్రీ కాస్ట్ వాల్స్ ను తొలగించి మమా అనిపించారు. ఇదేమిటీ నామమాత్రపు కూల్చివేతలతో వెనుదిరిగారు..అని ‘దిశ’ ప్రతినిధి అధికారులను ప్రశ్నిస్తే.. భూములకు సంబంధించి వారి(భూ కబ్జాదారుల) వద్ద దస్త్రాలు ఉన్నాయట.. జీవో 59 ద్వారా భూములను క్రమబద్దీకరించుకుంటారట, అందుకోసం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అధికార యంత్రాంగమే సమాధానం ఇవ్వడం గమనార్హం.

దీన్ని భట్టి చూస్తే అక్రమార్కుల పై అధికారులకు ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది. అక్రమార్కులకు ఏలా కొమ్ము కాస్తున్నారు.. ?ఉన్నతాధికారుల ఆదేశాలను ఏలా..? బేఖాతరు చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పట్టా భూములతో పాటు ఎప్ టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూముల క్రమ బద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తును పరిశీలించి తిరస్కరించడంతోపాటు చెరువు శిఖం భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జీవో 59 ద్వారా సదరు భూములను క్రమబద్దీకరించకుండా చెరువు భూములను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story