- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి..!
దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రామ పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. గ్రామాల అభివృద్ధి కోసం, అక్రమణల కట్టడి కోసం పని చేయాల్సిన సర్పంచులు, ఉప సర్పంచులు అందినకాడికి దండుకుంటున్నారు. కార్యదర్శులు సైతం వారితో కుమ్మక్కై మామూళ్ల మత్తులో జోగుతున్నారు. అక్రమార్కులకు అధికార అండదండలు ఉండటంతో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావటం లేదు.
దీనికి తోడు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా లక్షల నిధులు స్వాహ అవుతున్నాయి.తాజాగా మేడ్చల్ జిల్లాలోని సోమారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు నిధుల దుర్వినియోగానికి పాల్పడడంతో కలెక్టర్ వారిపై వేటు వేశారు. అదేవిధంగా మునీరాబాద్ లో కార్యదర్శి ప్రమీల దేవి అక్రమ నిర్మాణదారుల నుంచి వసూళ్ల కు పాల్పడుతుందని ఆరోపిస్తూ. ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు రాజీనామా చేయడం జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది.
సర్పంచ్, ఉప సర్పంచ్ ల సస్పెండ్..
మేడ్చల్ మండలం సోమారం గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్ పై సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ కవిత లపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం తోపాటు షెడ్యూలు ప్రకారం గ్రామ సభలు నిర్వహించడం లేదని, పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్లు పలువురు వార్డు సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రామంలో జరుగుతున్న అవినీతి, అక్రమణలపై డీఎల్పీఓ స్మీత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎంపీఓ కు అదేశాలు జారీ చేశారు. విచారణ చేపట్టిన ఎంపీఓ నిబంధనలకు విరుద్దంగా రూ.11,79,407 లు అభ్యంతర ఖర్చు చేయగా, రూ. 8,08,423 నిధులు దుర్వినియోగం చేసినట్లు నివేదిక సమర్పించారు.
ఈ నివేదిక ఆధారంగా సర్పంచ్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా నోటీసుకు సమాధానం ఇవ్వని కారణంగా ఎంపీవో నివేదికతో ఏకభవిస్తూ కరుణాకర్ రెడ్డి ని సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ ఈ నెల 26 వ తేదీన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి రాబట్టాల్సిన మొత్తం రూ.8,08,423 నిధులలో నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్ లలో రూ. 4,03,211.50 ల చొప్పున పంచాయతీ నిధులకు ఏడు రోజుల్లో జమ చేయాలని ఆదేశించారు. లేనియెడల రెవెన్యూ ఆర్ఆర్ చట్టం కింద రాబట్టాల్సి ఉంటుందని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కార్యదర్శి పై బదిలీ వేటు..
మునీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రమీలా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటుందని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ చిట్టిమిల్ల గణేశ్, ఉప సర్పంచ్ గుండ్రోల్ల నర్సింగరావులు తమ పదవులకు ఈ నెల 22వ తేదీన రాజీనామా చేయడం జిల్లాలో కలకలం రేపింది. కార్యదర్శి ప్రమీలా ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుందని, ఈ విషయమై కలెక్టర్, జిల్లా పంచాయతీ, ఎంపీడీఓ, మండల పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినితీ పంచాయతీ అధికారిపైన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ తమ పదువులకు రాజీనామా చేస్తున్నట్లు వారిద్దరు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో కార్యదర్శి ప్రమీలాపై బదిలీ వేటు పడింది. ఆమెను యాఢారం బదిలీ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
నిధుల గోల్ మాల్..
నగర శివారులోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్ అవుతున్నాయి. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నగదును పంచాయతీకి జమ చేయకపోవడం, చేయని పనులను చేసినట్లు చిత్రీకరించి బిల్లులు పొందడం, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పేరుతో నగదు కాజేయడం, జిల్లా అధికారుల ఖర్చుల పేరుతో నకిలీ బిల్లులతో నగదు పొందడం వంటి పలు రూపాల్లో పంచాయతీ సొమ్మును కొందరు దిగమింగుతున్నారు. ఇంకొందరు నకిలీ బిల్లులు సమర్పించి నిధులను కాజేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పలు గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం వెలుగు చూస్తోంది.
పలువురు సర్పంచ్‌లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లా అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తుండటంతో అక్రమార్కుల పదవీ కాలం ముగుస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇకపోతే పలుకు బడి, రాజకీయ అండదండలు ఉన్న సర్పంచ్ లు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నప్పటికీ వారిపైన వేటు వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం జంకుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.