శామీర్ పేట శిఖం మాయం..!

by Sumithra |
శామీర్ పేట శిఖం మాయం..!
X

దిశ, మేడ్చల్ బ్యూరో : శామీర్ పేట చెరువు కబ్జాకు గురవుతోంది. విశాలమైన చెరువు అక్రమణలతో చిక్కిపోతుంది. కొందరు భూ కబ్జాదారులు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం హద్దు (ఎఫ్ టీఎల్), బఫర్ జోన్లను ఆక్రమిస్తున్నారు. బండరాళ్లు, మట్టితో చెరువును పూడ్చుతున్నారు. రాజీవ్ రహదారిని అనుకుని చెరువు విస్తరించి ఉండడంతో కొందరి రాజకీయ నాయకుల కన్ను పడింది. భూ కబ్జాదారులతో కుమ్మక్కై, చెరువును చెరబడుతున్నారు. అధికార యంత్రాంగం పూర్తిసహకారం అందించడంతో చెరువు విస్తీర్ణం రోజురోజుకు హారతి కర్పూరంలా కరిగిపోతుంది.

సగానికి పైగా కబ్జా..

మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న శామీర్ పేట 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో దాదాపుగా 60 ఎకరాలకు పైగా అక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో కబ్జాదారులు భూ అక్రమణలకు పాల్పడుతున్నారు.

గుట్టుగా కబ్జా..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ సిద్దిపేట ప్రధాన (రాజీవ్ )రహదారి పక్కనే ఉన్న శామీర్ పేట ప్రాంతంలో భూమి ఎకర విలువ బహిరంగ మార్కెట్ లో రూ.4 నుంచి 5 కోట్లు ధర పలుకుతోంది. దీంతో కొందరు చెరువు పై కన్నేశారు. చెరువు నిండినప్పుడు నీళ్లు వచ్చే ప్రాంతం, దానికి అనుకుని ఉండే బఫర్ జోన్ లో ప్రహరీ, ఇతర కట్టడాలు నిర్మిస్తున్నారు. లోపలి ప్రాంతానికి వెళ్లి ఎవరు పరిశీలించలేరని గుర్తించిన కబ్జాదారులు ఎంచక్కా నిర్మాణాలు చేపట్టారు. శామీర్ పేట నుంచి పూడురుకు వెళ్లే దారిలో అరకిలోమీటరు దూరం వెళ్లితే గాని ఈ కబ్జాలు కనిపించవు. నల్సార్ విశ్వవిద్యాలయం పక్కనే చెరువు లోపలి ప్రాంతంలో భారీగా నిర్మాణాలు చేపడుతున్నారు. పెద్ద పెద్దబండరాళ్లను తీసుకువచ్చి, చెరువు ఒడ్డునే వేశారు. బఫర్ జోన్ ను ఇలా పూడ్చి అనంతరం ఎఫ్టీఎల్ కు ఎసరు పెట్టారు. చెరువును ఆనుకుని ఉన్న పెద్దమ్మ కాలనీ, మజీద్ పూర్, ఆలియాబాద్ లలో కూడా అక్రమణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఓ కీలక నేత ఎఫ్టీఎల్ ను అక్రమించి భారీ కట్టడాన్ని చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎఫ్టీఎల్ హద్దుల పై అనుమానాలు..

చెరువు ఎఫ్టీఎల్ హద్దురాళ్ల పై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెరువు పూర్తినిల్వ సామర్ధ్యాన్ని చూపేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ ఫిల్లర్ల స్థానాలను మార్చివేశారని చెబుతున్నారు. నీళ్లతో నిండినప్పుడు ఆ హద్దు చూపడానికి వీలుగా ఫిల్లర్లు ఉండాలని, దానికి భిన్నంగా చెరువు లోపలి భాగంలో ఏర్పాటు పై సందేహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎఫ్ టీఎల్ హద్దుకు 30 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. దీనికి భిన్నంగా శామీర్ పేట చెరువు అక్రమణల పాలైందనేది చూస్తే తెలిసిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed