Veterinary Hospital : వాక్సినేషన్ పేరుతో పశువైద్యశాల మూసివేత..

by Sumithra |
Veterinary Hospital : వాక్సినేషన్ పేరుతో పశువైద్యశాల మూసివేత..
X

దిశ, పేట్ బషీరాబాద్ : పశువులకు టీకాలు వేసే కార్యక్రమం ఉందంటూ రోజుల తరబడిగా పశువైద్యశాలను ( Veterinary Hospital ) మూసివేశారు. దీంతో వివిధ సమస్యలతో వచ్చిన కుక్కలు.. పశువులకు వైద్యం ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్ ( Quthbullapur ) వెటర్నరీ ఆసుపత్రిని 15వ తారీకు నుంచి మూసివేసి ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.

ఎఫ్ఎండీ వ్యాక్సినేషన్ వలనే..

ప్రభుత్వ ఆదేశాల మేరకు పశువులకు ఫుట్ అండ్ మౌత్ వాక్సినేషన్ చేసేందుకు వెటర్నరీ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఉదయం నుంచే పశువులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాక్సిన్ ( Foot and Mouth Vaccination ) వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సాధారణంగా ఏ వెటర్నరీ ఆసుపత్రి వద్దనైనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఉన్న సమయంలో సిబ్బంది కొరతతో మధ్యాహ్నం 11 లేదా 12 గంటల వరకు మూసివేస్తున్నారు. అయితే కుత్బుల్లాపూర్ ఆస్పత్రిని మాత్రం మొత్తంగా వాక్సినేషన్ కార్యక్రమం ఉన్నదంటూ మూసివేశారు. 15వ తారీకు నుంచి 31 వ తారీకు వరకు ఆసుపత్రి మూసివేసి ఉంటుందని ఏకంగా గ్రిల్ తలుపుకి ఇరువైపులా నోటీసు అంటించేశారు. మధ్యాహ్న సమయంలో వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినప్పటికీ ఆ సమయంలో కూడా ఆసుపత్రిని తెరవకుండా ఉండటం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్న పెట్స్ యజమానులు..

కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో మాత్రమే పశువుల ఆస్పత్రి ఉన్నది. ఇక్కడ ఒక పశు వైద్యుడితో పాటుగా సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాస్తో కూస్తో మందులు కూడా ఉన్నంత మటికి ఉచితంగా అందజేస్తూ ఉంటారు. ఈ ఆసుపత్రికి దూర ప్రాంతాల నుంచి కూడా పశువులను ట్రాలీలో ఎక్కించుకొని తీసుకువస్తారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఆసుపత్రి పూర్తిగా మూసివేసి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెట్స్ యజమానులు.

రెండు రోజులుగా వస్తున్నాం.. : హైమావతి , పెట్ యజమాని, చింతల్

మా కుక్కకు ఆరోగ్యం బాలేకపోవడంతో రెండు రోజుల క్రితం ఒకసారి వచ్చాం. అప్పుడు మూసివేసి ఉంది. ఈ రోజు వచ్చినప్పటికీ మూసివేసే ఉన్నది. అత్యవసరమైతే మీనాక్షి ఎస్టేట్, ఎన్సీఎల్ కాలనీలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా చెబుతున్నారని వాపోతున్నారు.

పూర్తిగా మూసి వేయటానికి లేదు : డిస్టిక్ వెటర్నరీ అధికారి సుధాకర్..

రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంని ఉదయం సమయంలో చేపడుతున్నాము. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది కొరత వలన ఆసుపత్రులను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ పూర్తిగా రోజు మొత్తం ఆసుపత్రి మూసివేయడానికి వీలులేదు. కచ్చితంగా మధ్యాహ్న సమయంలో ఆసుపత్రిని తెరిచి ఉంచి సేవలు అందించాలి. కుత్బుల్లాపూర్ పశువైద్యశాలను తెరిచి పశువైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. కాగా గురువారం విషయం తెలుసుకున్న జిల్లా వెటర్నరీ అధికారి సుధాకర్ శుక్రవారం నుంచి కుత్బుల్లాపూర్ పశువైద్యశాల 11 గంటల తర్వాత నుంచి తెరచి ఉంచే విధంగా చూస్తామని చెప్పినప్పటికీ శుక్రవారం రోజు సైతం ఆసుపత్రి పూర్తిగా మూతబడి ఉంది. ఇక శనివారం మధ్యాహ్నం 12 దాటినప్పటికీ ఆసుపత్రి తెచ్చుకోకపోవడంతో పెట్స్ యజమానులు పెంపుడు కుక్కలతో వైద్యుల రాక కోసం కుత్బుల్లాపూర్ వెటర్నరీ ఆసుపత్రి ముందు ఎదురుచూస్తూ వేచి ఉండటం కనిపించింది.

Advertisement

Next Story

Most Viewed