మైనంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశాడు : పద్మా రెడ్డి

by Naresh |   ( Updated:2023-11-09 10:07:03.0  )
మైనంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  ఏం చేశాడు  : పద్మా రెడ్డి
X

దిశ, పాపన్నపేట: గతంలో మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు చేసిందేంలేదని పద్మా రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చి కొత్తగా చేసేదేమీ లేదని, మన మెదక్ నియోజకవర్గం గురించి ఆతనికి ఏం తెలుసని ఆమె ఆరోపించారు. గురువారం మండల పరిధిలోని ముద్దాపూర్, రామ తీర్థం, నర్సింగ రావుపల్లి, మొదలుకుంట, ఆమ్రియా తండా, కందిపల్లి, చీకోడ్, కొంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని మహిళలు పద్మాదేవేందర్ రెడ్డికి మంగళ హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులతో బతుకమ్మ, కోలాటం ఆడుతూ సందడి చేశారు. ఏ గ్రామం వెళ్లినా ఆడపడుచుగా ఆదరిస్తున్నందుకు సేవ చేస్తూనే ఉంటానని తెలిపారు. అధికారంలో కేసీఆర్ ఉంటేనే కరెంటు పుష్కలంగా ఉంటుందని, లేకుంటే గోస పడటం తప్పదనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏండ్ల తరబడి గోస పడింది మర్చిపోవద్దన్నారు. నాడు రాష్ట్రంలో నీళ్లు, కరెంటు సరిగ్గా ఉన్నాయా అని గుర్తు చేశారు. అవన్నీ యాదించుకొని ఓటు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని పేర్కొన్నారు.

దేశంలోనే పంచాయతి రాజ్ వ్యవస్థను పటిష్టం చేసి గ్రామ పంచాయతీలను అభివృద్ధి పర్చి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామని, సౌభాగ్య లక్ష్మీ ద్వారా మహిళలకు రూ.3 వేలు ఇవ్వబోతున్నామన్నారు. రైతు భీమా తరహాలోనే రూ.5 లక్షల బీమాను కోటి కుటుంబాలకు చెయ్యబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్లు సైతం రూ.5 వేలు అందించనున్నామన్నారు. అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఏడుపాయల పాలకమండలి చైర్మన్ బాలాగౌడ్, మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు బద్రి మల్లేశం, గురుమూర్తి గౌడ్, జగన్, వెంకట్ రాములు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed