వాగొస్తే ఆగమే.. వంతెన కోసం నిరీక్షణ..

by Sumithra |
వాగొస్తే ఆగమే.. వంతెన కోసం నిరీక్షణ..
X

దిశ, ఝరాసంగం : ప్రభుత్వాలు మారినా ఆ గ్రామ ప్రజల కష్టాలు తీరడం లేదు. దశాబ్దాలుగా వంతెన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే గ్రామ ప్రజలు భయం గుప్పెట్లో బతకాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకులు, అధికారులు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్యారవరం గ్రామ పరిస్థితి ఇది. గతంలో దేవరంపల్లి గ్రామపంచాయతీలో ఉన్న ప్యారవరం గత ప్రభుత్వంలో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో సుమారుగా 600 జనాభా ఉంది. గ్రామాన్ని దశాబ్ద కాలం నుంచి వంతెన సమస్య తీవ్రంగా పీడిస్తుంది.

ప్రస్తుతం వర్షాకాలం కావడం భారీ వర్షాలు కురుస్తుండడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో నేతలు రోడ్డు, వంతెనల నిర్మాణాల పై చేసిన హామీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఈ ఒక్క రోడ్డు మార్గమే వ్యవసాయదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేందుకు దిక్కు. వర్షం వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో దారి అంటూ ఏదీ లేదు దీంతో దిక్కు తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పొంగే వాగులు

ఝరాసంగం మండలంలోని రేజింతల్ -ఎల్గోయి, బర్దిపూర్-మాచునూర్, బిడ్డ కన్య - కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో భారీ వర్షానికి నీరు వచ్చి రాకపోకలు నిలిచిపోతున్నాయి.

ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం.. ఏఈ శశిధరెడ్డి, ఝరాసంగం

ప్యారవరం వంతెన వాగు పై నిర్మాణం కోసం గత రెండు వారాల క్రితమే ప్రభుత్వానికి రూ. 3కోట్ల మంజూరు గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే టెండర్లకు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed