కానరాని ఫుడ్​సేఫ్టీ.. మామూళ్ల మత్తులో అధికారులు

by Aamani |
కానరాని ఫుడ్​సేఫ్టీ.. మామూళ్ల మత్తులో అధికారులు
X

దిశ, హన్మకొండ: హన్మకొండ జిల్లాలో కొన్ని హోటల్స్ యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు హోటల్స్, బేకరీస్, రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించింది. తినుబండారాల్లో పురుగులు, కుళ్లిన ఆహార పదార్థాలు బయట పడిన సందర్భాలు ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా హోటల్స్ యజమానులు నిల్వ ఉంచిన పదార్థాలను భోజన ప్రియులకు అందిస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారుల జాడే కనిపించడం లేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు ప్రత్యక్షమై ఫుడ్ శాంపిల్స్ సేకరించి హడావిడి చేసి నోటీసులు జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరుసటి రోజు వాటిని పట్టించుకోకపోవడం షరా మామూలే. మరో వైపు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎంక్వైరీ పేరుతో జోరుగా వసూళ్ల దందా కు పాల్పడుతున్నట్లు పలువురు రెస్టారెంట్ యజమానులు ఆరోపిస్తున్నారు. హనుమకొండకు ఉన్న బ్రాండ్ ఇమేజ్​ను కాపాడేందుకు ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ విభాగంలో అధికారుల సంఖ్య పెంచేందుకు, ఫిర్యాదుల విషయంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు ఎఫ్ఎస్ఏఐ సర్టిఫికెట్లు, లైసెన్స్ , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటు మొబైల్ టెస్టింగ్ ఫుడ్ ల్యాబ్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు హోటళ్లు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

హోటళ్లలో క్వాలిటీ లేని ఫుడ్..

హన్మకొండలో పేరొందిన రెస్టారెంట్లు, భోజనం హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. రోజు వేలాది మంది ప్రజలు, పర్యాటకులు జిల్లాకు వచ్చి వెళ్తుంటారు. భోజనం కోసం స్థానికంగా హోటల్స్ వైపే మక్కువ చూపిస్తారు. హన్మకొండ నగరంలో ప్రతి గల్లీకి రెండు మూడు కు పైగా హోటల్స్ దర్శనం ఇస్తాయి. కాగా కొన్ని హోటళ్లలో సరైన నాణ్యతలేని ఫుడ్​ యజమానులు కస్టమర్లకు అందిస్తున్నారు. ఆరగించిన కస్టమర్లు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా హోటల్స్, బేకరీస్, రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించింది. కిచెన్లు, వాష్ రూమ్​లలో పరిశుభ్రత లోపించి దుర్గంధంతో దోమలు, బ్యాక్టీరియా స్వైర విహారం చేస్తున్నాయి. పలు మార్లు హోటళ్లలో తినే ఆహారంలో పురుగులు బయట పడిన సందర్భాలు ఉన్నాయి. కళ్లిపోయిన, ఫ్రిడ్జ్​లో నిల్వ చేసిన ఆహారపదార్థాలను వేడిచేసి వడ్డించిన ఘటనలు వెలుగు చూశాయి. మరి రెస్టారెంట్లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలు యాజమాన్యాలు మాత్రం ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని పలువురు మండిపడుతున్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడేది..

హన్మకొండ నగరంలో వందల సంఖ్యలో హోటల్స్, బేకరీస్, రెస్టారెంట్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తుంటే జిల్లాలో మాత్రం అందుకు విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనిఖీలు చేపట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కార్యాలయానికి కూడా రాకుండా ఉండటం గమనార్హం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు ప్రత్యక్షమై నామ మాత్రపు తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ ను సేకరించి హడావిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండడం పలు అనుమానాలు తావిస్తోంది. ఒక్కొక్క అధికారికి రెండు సర్కిళ్లలో బాధ్యతలు అప్పగించడంతో తనిఖీలు శూన్యం గానే కనిపిస్తున్నాయి. ఇదే అదనుగా కొన్ని హోటల్స్ యజమానులు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఫోన్ చేసినా ఎత్తని అధికారి..

ప్రతి రోజూ ఎంక్వైరీ పేరుతో ఫుడ్ సేఫ్టీ అధికారి కనీసం ఆఫీసుకు రావడం లేదనే అపవాదు ఉంది. ఫోన్ చేసినా ఎత్తని అధికారి ఆఫీసులో సైతం కనిపించడనే ఆరోపణలు ఉన్నాయి. ఎంక్వైరీ పేరుతో సొంత పనులు చక్కబెట్టుకుంటున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పలు రెస్టారెంట్లకు అనుమతులు ముగిసినా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు పేర్కొంటున్నారు. పర్మిషన్ ముగిసిన రెస్టారెంట్ యజమానులు పలువురు రెన్యూవల్​కోసం భారీగానే చేతులు తడుపుపాల్సి వస్తుందని పలువురు రెస్టారెంట్ల యజమానులు పేర్కొంటున్నారు. ఎఫ్ ఎస్ ఏఐ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిపై ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed