HYD: మల్కం చెరువులోకి మలినాలు.. కలుషితం అవుతున్న చెరువు

by Ramesh Goud |
HYD: మల్కం చెరువులోకి మలినాలు.. కలుషితం అవుతున్న చెరువు
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఐటీకి వేదికైన శేరిలింగంపల్లి జోన్‌లో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) పథకం కింద పలు చెరువులను ఆయా నిర్మాణ సంస్థలు దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేశాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించనట్లు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ అభివృద్ధి పేరిట నిర్మాణ సంస్థలు చెరువులను కబ్జా చేశాయన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. కొన్ని నిర్మాణ సంస్థలు చెరువులను అభివృద్ధి చేసినా వాటిని సరైన రీతిలో మెయింటెన్ చేయకపోవడంతో అవి ఇప్పుడు దుర్గంధంగా మారిపోతున్నాయి. అలాంటి వాటిలో శేరిలింగంపల్లి సర్కిల్ 20 గచ్చిబౌలి డివిజన్‌లోని మల్కం చెరువు ఒకటి. ఈ చెరువు చుట్టూ సుందరీకరణ చేసినా అందులో చేరుతున్న మురుగు నీటితో దుర్గంధమయంగా మారిపోయింది.

అందంగా సుందరీకరణ..

గచ్చిబౌలి డివిజన్‌లోని రాయదుర్గం మల్కం చెరువు పూర్తి విస్తీర్ణం ఇరిగేషన్ రికార్డుల ప్రకారం 50.37 ఎకరాలు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ చెరువును అపర్ణ రియల్‌ఎస్టేట్ సంస్థ అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.20 కోట్లతో చెరువు చుట్టూ 1.07 కిలోమీటర్ల మేర కొత్తగా బండ్ నిర్మించి, మంచి థీమ్‌తో అభివృద్ధి చేశారు. మధ్యలో రాక్ గార్డెన్, వినాయక నిమజ్జన పాండ్, బతుకమ్మ కుంట ఇలా దేనికి దానిగా ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. చెరువు చుట్టూ రకరకాల మొక్కలు నాటారు. చెరువు చుట్టూ సుందరీకరణ పనులు, పరిరక్షణ కోసం 32 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక్కడ పార్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ముక్కు మూసుకోవాల్సిందే..

అందంగా తీర్చిదిద్దిన మల్కం చెరువు ఇప్పుడు మళ్లీ దుర్గంధ భరితంగా మారింది. నాలాల నుంచి నీరు రాకుండా, కేవలం వర్షం నీటితోనే నింపేలా ఇరిగేషన్ అధికారులు ప్లాన్ చేశారు. అలాగే బయట నుంచి చెరువులోకి వచ్చే నీటిని మూడు విడతలుగా విభజించి వాటిని శుద్ధి చేసి చెరువులో చేరేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, హాస్పిటళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు మల్కం చెరువులో చేరుతుంది. ఇన్‌లెట్ల నుంచి వచ్చే నీరు చెరువులోకి వెళ్లడంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. వాకింగ్‌కు వచ్చే ప్రజలు, సందర్శకులు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. గతంలో ఇక్కడికి వాకింగ్‌కు వచ్చే వారు ఈ దుర్గంధం భరించలేక వాకింగ్‌కు రావడమే మానేశారు.

అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం..

చెరువులోకి భారీ ఎత్తున మురుగు నీరు చేరుతుంది. దీంతో దుర్గంధం వెలువడుతుంది. ఈ అంశాన్ని వాకర్స్ తమ దృష్టికి తీసుకువచ్చారని, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు మల్కం చెరువు ఇన్‌లెట్లను పరిశీలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ దుర్గంధం వల్ల రెగ్యులర్‌గా వాకింగ్‌కు వచ్చేవారు, పిల్లలతో కలిసి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి మల్కం చెరువులోకి మలినాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వాకర్స్, సందర్శకులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed