రోడ్డు కనెక్టివిటీ సమస్యను పరిష్కరించాలి..

by Sumithra |
రోడ్డు కనెక్టివిటీ సమస్యను పరిష్కరించాలి..
X

దిశ, పటాన్ చెరు : తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఈదుల నాగులపల్లి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ లేక గ్రామస్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు చేపట్టిన 48 గంటల నిరవధిక దీక్ష రెండవ రోజు కొనసాగింది. రెండవ రోజు దీక్షకు మాజీ మంత్రి బాబు మోహన్, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. తమ కుటుంబ అభివృద్ధి పై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు తీర్చడంలో లేదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో రేడియాల్ రోడ్ నెంబర్ 7 ఫ్లై ఓవర్ నిర్మించి మధ్యలో వదిలేయడంతో గ్రామంలో రాకపోకలకు తీవ్రఅంతరాయం కలుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ఈ విషయం పై గ్రామస్థులు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోకుండా ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు కండ్లుతెరిచి యుద్ధప్రాతిపదికన గ్రామ రోడ్ కనెక్టివిటీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

చేతకాకపోతే దిగిపోండి : గడీల శ్రీకాంత్ గౌడ్..

స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ లేని అభివృద్ధి చేస్తున్నట్లు ఉదరగొడుతున్నాడు. ఏదో ఉద్ధరిస్తానని నాగులపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే భూముల్ని అమ్ముకోవడం, కమిషన్లు తీసుకోవడం అనుకుంటున్నాడు. వ్యాపారుల కోసం ఆగమేఘాల మీద స్పందించే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి గ్రామస్థుల బాధలు కనిపిస్తలేవా..? మహనగరానికి దగ్గరలో ఉన్న గ్రామానికి కనీస రోడ్డు కనెక్టివిటి కల్పించకపోవడం ఆయన అసమర్థత.. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు కనెక్టివిటీ కల్పించాలి. అండర్ పాస్ బ్రిడ్జి ఎత్తు పెంచాలి.. అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలి. ఎమ్మెల్యే మీకు చేతకాకపోతే పదవి నుండి దిగిపోవాలి. మేము ముందుండి పనులను పూర్తి చేయిస్తాం. రోడ్డు కనెక్టివిటీ సౌకర్యం కల్పించే వరకు మా పోరాటం ఆగదు.

అభివృద్ధిని గాలికి వదిలేశారు : గోదావరి అంజి రెడ్డి..

కేసీఆర్ నాయకత్వంలోని భారాస ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలివేశారు. తమకు ఆర్థికంగా లాభం వచ్చే చోట్ల, కమిషన్లు దొరికే ప్రాంతాలలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీకు అనుకూలమైన చోట కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రింగ్ రోడ్డు కోసం తమ భూముల్ని త్యాగం చేసిన గ్రామస్థుల సమస్యలని గుర్తించండి. రింగ్ రోడ్డుని అనుకుని ఉన్న నాగులపల్లి గ్రామంలో రోడ్డు కనెక్టివిటీ సమస్యను పరిష్కరించండి. అభివృద్ధి అంటూ మాటలు చెప్పడం కాదు చేతలలో చేసిచూపి గ్రామస్థుల రోడ్డు సమస్యను పరిష్కరించాలి. రోడ్డు సమస్య తీర్చే వరకు బీజేపీ పోరాటం ఆగదు.

Advertisement

Next Story

Most Viewed