- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వివాదాస్పద భూములే టార్గెట్.!
దిశ,పటాన్ చెరు : రాష్ట్రంలోనే విలువైన భూములు ఉన్న పటాన్ చెరు ప్రాంతంలో వివాదాస్పద భూములపై పైరవీలు మొదలయ్యాయి. పైరవీకారుల పక్షాన వకాల్తా పుచ్చుకుని ఉన్నతాధికారులు పేదల కడుపు కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మహానగరంలో అంతర్భాగమై వాయు వేగంతో ఆకాశ హర్మ్యాల నిర్మాణాలతో పాటు విలాసవంతమైన గృహ నిర్మాణాలతో దూసుకుపోతున్న పటాన్ చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్ పూర్ మున్సిపాలిటీలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వివాదాస్పద భూముల్ని చెరబట్టే ప్రణాళికలతో కొన్ని ముఠాలు రంగంలోకి దిగాయి.
ఆ ముఠాలకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పూర్తి అభయహస్తం ఇస్తున్నారు. ఏండ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న భూములకు సైతం క్లీన్ చీట్ ఇస్తూ అడ్డదారిలో అప్పనంగా కట్టబెడుతున్నట్లు పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో మునుపెన్నడూ లేని రీతిలో రైతులు సాక్షాత్తు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పైనే అవినీతి ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రూ.వెయ్యి కోట్ల భూములను తప్పుడు నివేదికలతో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కలిసి బడా బాబులకు కట్టబెట్టారని కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లెక్సీలతో బాధితులు బహిరంగ విమర్శలు చేయడం చర్చకు దారి తీసింది.
మిగులు భూములు బడాబాబుల గుప్పిట్లోకి..?
సంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో మిగులు భూముల్ని సాగు చేసుకుంటున్న రైతుల దగ్గర నుంచి లాక్కుని కొందరు బడా రియల్ వ్యాపారవేత్తలకు దోచిపెడుతున్నారని ఆరోపిస్తూ రైతులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన దిగారు. ఏకంగా జిల్లా కలెక్టర్ రూ. వెయ్యి కోట్ల భూముల్ని కొందరు బడా వ్యాపార వేత్తలకు అప్పనంగా కట్టబెడుతున్నారని బహిరంగ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై రైతుల ఆందోళన కొనసాగుతుండగానే రామచంద్రపురం మండలం వెలిమల తండాలో భారీ పోలీస్ బలగాల ప్రొటెక్షన్ మధ్య వివాదాస్పద మిగులు భూముల్లో పెద్ద ఎత్తున జేసిబీలతో భూముల్ని చదను చేస్తున్నారు.
పోలీస్ ప్రొటెక్షన్ తో పనులు మొదలు పెట్టడంతో భారీగా గ్రామస్తులు, రైతులు పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉధృక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టడంతో యధావిధిగా చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. ఒకపక్క తమకు న్యాయం చేయాలని అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా పోలీస్ భద్రత మధ్య తమ భూముల్లో అక్రమంగా చెరబడుతున్నారని గిరిజన రైతులు వాపోతున్నారు. ఏండ్లుగా ఈ భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న తమకు అన్యాయం చేయడం సరికాదని వేడుకుంటున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని రైతులు ఖరాకండిగా చెప్తున్నారు.
కొల్లూరు లో వివాదాస్పద భూములకు లైన్ క్లియర్..
ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సివిల్ వివాదాల పట్ల అక్రమాల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంటే సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు మాత్రం వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఒక పక్క వెలిమల మిగులు భూములు బడా బాబులకు కట్టబెట్టిన వివాదం నడుస్తుండగానే మరొక పక్క 20 ఏళ్లకు పైగా వివాదంలో ఉన్న కొల్లూరు పరిధిలోని సర్వే నంబర్ 175,181,183 లతో పాటు మరికొన్ని సర్వే నెంబర్లను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ భూమికి సంబంధించిన వివాదం న్యాయస్థానం తో పాటు లోకాయుక్త పరిధిలో నడుస్తున్నప్పటికీ అవన్నీ పక్కనపెట్టి కిందిస్థాయి అధికారుల రిపోర్టును సైతం కాదని పిఓబీ జాబితాలో నుంచి బయటకు తెచ్చారు.
ఈ విషయానికి సంబంధించి ఒక ఉన్నతాధికారి కి సంబంధించిన కుటుంబ సభ్యుడు పైరవీ చేసి అన్ని తానై నడిపించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వరుస వివాదల పై పూర్తి ఆధారాలతో వరుస కథనాలు వస్తున్న చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద అధికారుల ప్రమేయం ఉండడంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడంలో అధికారులు జంకుతున్నారు. ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలపై కిందిస్థాయి అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న వివాదాస్పద భూముల క్లియరెన్స్ ఫైల్లు చకచకా కదులుతుండడంపై గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల సైతం ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రతిపక్షాల మౌనముద్ర..
పటాన్ చెరు ప్రాంతంలో పెద్ద ఎత్తున వివాదాస్పద భూములకు సంబంధించిన ఫైళ్లు చక చక కదులుతున్న రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెప్తున్న బీజేపీ పార్టీ నేతలు మౌనం వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న వివాదం జరిగిన క్షణాల్లో అక్కడ వాలి హంగామా చేస్తున్న ప్రతిపక్ష నాయకులు పటాన్ చెరు ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై మౌనం వహిస్తున్నారు. కొల్లూరు లో రూ. వేయి కోట్ల నిషేధిత భూములకు క్లియరెన్స్ తో పాటు వెలిమలలో మిగులు భూములు పేద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన యొక్క పార్టీ నాయకుడు మద్దతు ఇవ్వక పోవడం గమనార్హం.
గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆ బడా బాబులకు ఉన్న సంబంధాల నేపథ్యంలోనే వేల కోట్ల భూ కుంభ కోణాలు జరుగుతున్న పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా భూకబ్జాలు కుంభకోణాలపై నిక్కచ్చిగా వ్యవహరిస్తూ కఠినంగా ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటాన్ చెరు ప్రాంతంలో జరుగుతున్న భూ కుంభకోణాలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటేనే ప్రజలు హర్షిస్తారు. లేనిపక్షంలో ఈ వరుస భూ వివాదాలు ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే అవకాశాలున్నాయి.