ఎంపీపీ పై నెగ్గిన అవిశ్వాసం

by Disha Web Desk 22 |
ఎంపీపీ పై నెగ్గిన అవిశ్వాసం
X

దిశ, కొండపాక: కొండపాక మండల ఎంపీపీ రాగల సుగుణ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కొండపాక ఎంపీపీ పై ఈనెల 5 న అవిశ్వాసం ప్రకటిస్తూ 9 మంది సభ్యులు ఆర్డీవోకు అవిశ్వాస తీర్మానం పత్రం అందజేశారు. దీంతో ఆర్డీవో బన్సీలాల్ అవిశ్వాస తీర్మాణ సమావేశానికి తేదీ ప్రకటించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. తీర్మానం ఇచ్చిన నాటి నుంచి క్యాంపులోకి వెళ్లిన ఎంపీటీసీ సభ్యులు నేరుగా సమావేశ మందిరానికి వచ్చారు. ఈ సమావేశానికి 9 మంది హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో నిబంధనల ప్రకారం అవిశ్వాసం నెగ్గిందని ఆర్డీఓ బన్సీలాల్ ప్రకటించారు. కొండపాక మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కుకునూరుపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన గీత ఆరోగ్యంతో మృతి చెందింది. దీంతో 13 మంది ఉన్నారు. సమావేశానికి మూడింటిలో రెండు మంది సభ్యులు కావలసి ఉండగా అంతమంది హాజరయ్యారు. నివేదికను పై అధికారులకు పంపిస్తామని అధికారుల సూచన మేరకు ఎంపీపీ ఎన్నిక కోసం తేదీ ప్రకటిస్తామని ఆర్డీవో తెలిపారు. కాగా కొండపాక మండలం ఎంపీపీ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో కొండపాక ఎంపీటీసీ సభ్యురాలు మంచాల అనసూయకు దక్కనుంది.

పోలీసు బలగాల మధ్య...

కొండపాక ఎంపీపీ అవిశ్వాస సమావేశం సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు బలగాలను కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. అవిశ్వాసానికి సరైన కోరం ఉండడం వల్ల ప్రశాంత వాతావరణంలో అవిశ్వాసం నెగ్గింది.

నిధులు, గౌరవం లేకపోవడంతోనే పార్టీ మారాను : ఎంపీటీసీ సభ్యురాలు మంచాల అనసూయ

ఐదేళ్ల పాలనలో ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పాటు ఎలాంటి గౌరవం ఇవ్వకపోవడంతోనే బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కొండపాక ఎంపీటీసీ సభ్యురాలు మంచాల అనసూయ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పార్టీకి ఆకర్షితులై మండల అభివృద్ధి కోసం పార్టీలో చేరినట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు



అవిశ్వాసంపై సమావేశం జరుగుతుండడంతో కొండపాకకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ స్థానం లభిస్తుందనే భావనతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు అనంతుల నరేందర్ మంచాల చిన్న శ్రీనివాస్ రెడ్డి రవీందర్, వాసరి లింగారావు, విరుపాక శ్రీనివాసరెడ్డి , కోల ఉపేందర్ ఐలం యాదవ్, కనక రాములు తదితరులున్నారు.


Next Story

Most Viewed