గేటెడ్ కమ్యూనిటీ తరహాలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాం.. మంత్రి హరీశ్ రావు

by Javid Pasha |
గేటెడ్ కమ్యూనిటీ తరహాలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాం.. మంత్రి హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో దిగ్వాల్ లోనూ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించామని మంత్రి హరీష్ రావు చెప్పారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ.5 కోట్ల 60 లక్షల వ్యయంతో 88 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కోహీర్ లో నిర్మించామని తెలిపారు. రూ.150 కోట్ల నిధులతో జహీరాబాద్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఒకప్పుడు ఇళ్లు రావాలంటే లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తామని చెప్పారు.

సర్కారు దవాఖానాల్లో నిర్వహిస్తున్న ప్రసూతి ఆపరేషన్లలో సంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. రేపటి నుండి రైతుబంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసి, వారికి అండగా ఉంటామన్నారు. దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ర్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story