Medak MP: ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా..?

by Aamani |
Medak MP: ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్ర ప్రజలు డెంగీ, సీజనల్ వ్యాధుల బారిన పడి అవస్థలు పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేసే పనిలో ఉండటం దురదృష్టకరమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...చెరువుల కబ్జాల విషయంలో హైడ్రా పనితీరు బాగుంది కానీ.. ఆదే సమయంలో ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరం అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వైద్య శాఖలో డాక్టర్లు, నర్సుల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్నారు. గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల కాక పారిశుధ్యం పడకేసిందన్నారు. బీసీ కుల గణన వ్యతిరేకం కాదని చెప్పిన ఎంపీ.. ఈ కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయకుండా 2 నెలల లోపు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం ప్రతి గ్రామ పంచాయతీ కీ రూ.50 వేలు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, బైరి శంకర్ ముదిరాజ్, నరేష్, విభీషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story