ప్రాణాలు పోయినా భూములివ్వం

by Sridhar Babu |
ప్రాణాలు పోయినా భూములివ్వం
X

దిశ, జహీరాబాద్ : ప్రాణాలు పోయినా ఫార్మాసిటీకి భూములివ్వమని భూ నిర్వాసితులు తెగేసి చెప్పారు. ఫార్మా కంపెనీల వ్యర్థ జలాలతో పర్యావరణ కాలుష్యం, భూములు , భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్ గ్రామంలో ఫార్మాసిటీ భూ నిర్వాసితులతో పర్యావరణవేత్తలు ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, నరసింహారెడ్డి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఫార్మాసిటీ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారని డప్పుర్, మల్గి, వడ్డీ గ్రామానికి చెందిన నిర్వాసితులు తెలిపారు. సిటీ ఏర్పాటుతో పంటలు పండే విలువైన భూములతో పాటు భూగర్భ జలాలు కలుషితమై తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫార్మా ఖర్మాగారాలు విడుదల చేసే వ్యర్థ జలాల కాలుష్యంతో ప్రజలు పలు రకాల రోగాలకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై ఆధారపడ్డ తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా ఫార్మాసిటీకి భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ అనుమతులు, గ్రామసభలు లేకుండా భూసేకరణ చేపట్టవద్దన్నారు. భూ నిర్వాసితులు గ్రామస్తులు కలిసికట్టుగా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే విజయం సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed