Harish Rao : 9 నెలల్లో సిద్దిపేట అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు చేయలె..

by Aamani |
Harish Rao : 9 నెలల్లో సిద్దిపేట అభివృద్ధికి  ఒక్క రూపాయి ఖర్చు చేయలె..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో సిద్దిపేట అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక పోగా...రూ. 150 కోట్లతో నిర్మిస్తున్న వెటర్నరీ కాలేజీని గద్దలా తన్నుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలు గమనించాలని హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 151 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ నియోజక వర్గంగా తీర్చి దిద్దు కున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజ్, మహిళా డిగ్రీ కళాశాల, వెటర్నరీ కాలేజీలను సిద్దిపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రూ.150 కోట్లతో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు తరలించుకుపోయిండని మండిపడ్డారు. కొడంగల్ నియోజక వర్గంలో అవసరమైతే కొత్త కాలేజీని మంజూరు చేయించుకోవాలి కానీ సిద్దిపేట వెటర్నరీ కాలేజీ తరలించుకొని వెళ్లడం అన్యాయం అన్నారు. 9 నెలలుగా కోమటి చెరువు శిల్పారామం పనులు ఆగిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కొట్లాడి సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురిని ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు.

Advertisement

Next Story