గంగరగోళంగా రైతు దినోత్సవ వేడుకలు

by Shiva |
గంగరగోళంగా రైతు దినోత్సవ వేడుకలు
X

రైతు రుణమాఫీ, ధరణి సమస్యలపై అధికారులను నిలదీసిన రైతులు

దిశ, దౌల్తాబాద్ : దశాబ్ధి ఉత్సవాల పేరుతో గ్రామాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతూనే ఉన్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం మండల వ్యాప్తంగా దౌల్తాబాద్, తిర్మలాపూర్, ముబారాస్ పూర్, దొమ్మాట క్లస్టర్లలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. దౌల్తాబాద్ క్లస్టర్లో జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రహీమొద్దీన్, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, తిర్మలాపూర్ క్లస్టర్లో ఏఎంసీ చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మీ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, ముబారాస్ పూర్ క్లస్టర్లో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తుమ్మ స్టీవెన్ రెడ్డి, దొమ్మాట క్లస్టర్లో ఎంపీపీ గంగాధరి సంధ్య, రైతులతో కలిసి పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగంలో చేసిన అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం గ్రామస్థాయిలో అధికారులు, సర్పంచ్ లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో గ్రామాల నుంచి జనాన్ని తరలించారు. సమావేశానికి వచ్చిన గ్రామస్థులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. రైతు సంక్షేమం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రభుత్వంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ సందర్భంగా రైతులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. క్లస్టర్లో కూడా రైతు సదస్సులు పెట్టకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ కరువైందన్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా ఈ సంబరాలేందని రైతులు మండిపడ్డారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినా ఇప్పటి వరకు అందలేదన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని నిలదీశారు.

మండలంలోని అన్ని క్లస్టర్ల లో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ధాన్యం కొనుగోలు చేసి 20 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు డబ్బు జమ కాలేదని రైతుల నిలదీతతో ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు, బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకున్నారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీకి అదే రైతుల నుంచి వ్యతిరేకత రావడం ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఆయా కార్యక్రమాల్లో ఎంఈవో నర్సవ్వ, ఎంపీవో గాఫూర్ ఖాద్రీ, ఐకేపీ ఏపీఎం ఆస కిషన్, ఏవో గోవిందా రాజులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed