Dengue cases:డెంగీ డేంజర్ బెల్స్..రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-25 15:20:21.0  )
Dengue cases:డెంగీ డేంజర్ బెల్స్..రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి:జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. జనవరి నుంచి జూలై నాటికి అధికారిక లెక్కల ప్రకారం 8 కేసులు నమోదు కాగా ఆగస్టు నాటికి 52 డెంగీ కేసులు నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన 5 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. కాగా లెక్కలోకి రాని డెంగీ కేసులు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలా ఉంటే జిల్లా పరిధిలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 1 మలేరియా, 11 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. అనధికారికంగా జిల్లా పరిధిలోని ప్రజలు వేల సంఖ్యలో విష జ్వరాల బారిన పడినట్లు తెలుస్తోంది.

* నెల వ్యవధిలో 44 డెంగీ కేసులు నమోదు..

జిల్లాలో డెంగీ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. జనవరి నుంచి జూలై నాటికి జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 8 డెంగీ కేసులు నమోదయ్యాయి. కాగా ఆగస్టు 24 నాటి డెంగీ కేసుల సంఖ్య 52 కు చేరింది. నెల వ్యవధిలోనే జిల్లా పరిధిలో 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా డెంగీ కేసుల సంఖ్య రెండు అంకెల సంఖ్య దాటినట్లు సమాచారం.

* డెంగీతో బాలుడు మృతి..

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం 5 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

* గత సీజన్ లో 62 డెంగీ కేసులు..

గత సీజన్ లో జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 62 డెంగీ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్ నగర్, నసర్ పుర పీహెచ్ సీల పరిధిలో 17 కేసులు, సిరిగిరి పల్లి పీహెచ్ సీ పరిధిలో 5, భూంపల్లి, రామక్కపేట, హుస్నాబాద్ పీహెచ్ సీల పరిధిలో 4, వర్గల్, తొగుట పీహెచ్ సీ పరిధిలో 4 డెంగీ కేసులు చొప్పున నమోదయ్యాయి.

పడకేసిన పారిశుధ్యం..

జిల్లా పరిధిలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించిన నీటి గుంతలతో పాటుగా మురుగు కాలువలు, పగిలిన కుండలు, తొట్లలో నిల్వ ఉన్న నీటి తొలగిస్తున్నప్పటికీ పక్కాగా అమలు కాకపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. అధికారులు పరిసరాల పరిశుభ్రత సీజనల్ వ్యాధుల పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు తప్పితే విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో దోమల నివారణ చర్యలు, ఫాగింగ్ చేపట్టిన దాఖలాలు లేవని ప్రజలు మండిపడుతున్నారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..

ఎన్‌వీబీడీసీపీ ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు. రోగాల బారిన పడకుండా ప్రజలు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం తో పాటుగా స్వీయ పరిశుభ్రత పాటించాలి. ఇంటి చుట్టు ప్రక్కల ప్రదేశంలో నీరు నిల్వ కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అనారోగ్యానికి గురైన ప్రజలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.

Advertisement

Next Story