చిట్కుల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

by Shiva |
చిట్కుల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
X

దిశ, పటాన్ చెరు: దేవాలయ భూములను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. మండల పరిధలోని చిట్కుల్ గ్రామ పంచాయతీ సర్వే నెం.266, 267, 305, 306లోని సుమారు 8.05 ఎకరాల్లో అభయాంజనేయ స్వామి ఆలయ భూమి విస్తరించి ఉంది. అయితే, ఆలయ భూమి అనుకుని గృహ నిర్మాణాలు జరిగాయి. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు ఆలయ భూముల ఆక్రమించారనే ఫిర్యాదులు రెవెన్యూ అధికారులకు అందాయి.

గత రెండు నెలల క్రితం ఏడీ సర్వేయర్ తో సర్వే నిర్వహించి ఐదు ఇళ్లు పూర్తిగా, మరో మూడు ఇళ్లు పాక్షికంగా ఆలయ భూముల్లో నిర్మించారని అధికారులు నివేదికను రూపొందించారు. ఈ క్రమంలో అప్పట్లోనే రెవెన్యూ అధికారులు సదరు ఇళ్ల యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. సదరు ఇళ్ల యజమానులు ఇళ్లను ఖాళీ చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శనివారం పటాన్ చెరు ఎమ్మార్వో పరమేశ్వరం ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలు పెట్టారు. మొత్తం ఐదు ఇళ్లను పూర్తిగా, మూడు ఇళ్లను పాక్షికంగా నేలమట్టం చేశారు.

కూల్చివేతల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ వేణుగోపాల్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో పరమేశం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేంది లేదని హెచ్చరించారు. భూ కొనుగోలుదారులు ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన డీటీసీపీ, హెచ్ఎండీఏ వెంచర్ల లో మాత్రమే ప్లాట్లు, ఇళ్లను కొనుగోలు చేయాలని సూచించారు.

Advertisement

Next Story