కుక్కలపై కర్కశత్వం..తీవ్రంగా ఖండిస్తున్న జంతు ప్రేమికులు

by Aamani |
కుక్కలపై కర్కశత్వం..తీవ్రంగా ఖండిస్తున్న జంతు ప్రేమికులు
X

దిశ,సంగారెడ్డి అర్బన్ : చాలా మంది జంతు ప్రేమికులు తమ ఇంట్లో సొంత పిల్లల్లాగా శునకాలను ఎంతో ఆప్యాయంగా తెచ్చి పెంచుకుంటారు. వాటికి చిన్న గాయమైన తట్టుకోలేక అల్లాడిపోతారు. కానీ సంగారెడ్డి జిల్లాలో ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 32 వీధి కుక్కలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాటి కాళ్ళను, మూతులను వైర్లతో కట్టేసి బ్రిడ్జిపై నుంచి విసిరేసి చంపేశారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాళ్లు.. మూతులు కట్టేసి విసిరేశారు..

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం గ్రామ శివారులో ఈ నెల 4వ తేదీన వంతెన కింద శునకాల అరుపులు వినబడటాన్ని స్థానికులు గమనించారు. అధికారులకు సమాచారం అందించడంతో పీపుల్స్ ఫర్ అనిమల్స్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. దయనీయ స్థితిలో ఉన్న మూగజీవాలను రక్షించేందుకు యత్నించింది. సుమారు 32 కుక్కలను వైర్లతో కట్టేసి 40 అడుగుల ఎత్తు ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి కిందికి విసిరేశారు. ఇందులో 21 కుక్కలు అక్కడికక్కడే మృతి చెందాయి. తీవ్ర గాయాలపాలైన మరో 11 కుక్కలను నాగోల్ లోని పీపీఎఫ్ కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై ఇంద్రకరణ్ పోలీసులు బీఎస్ఎన్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా వేరే చోట వాటిని చంపి ఇక్కడ విసిరేసారా, లేదా ఇక్కడికే తెచ్చి వాటిని చంపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్ కుమార్ వివరించారు. ఈ సంఘటనకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed