కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి మౌనం

by Mahesh |   ( Updated:2023-08-17 03:03:15.0  )
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి మౌనం
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సంకేతాలున్నాయో ఏమో తెలియదు కానీ ఆయనను చేర్చుకోవద్దని ఆ పార్టీ నాయకులు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పార్టీ మారుతారా..? రాజకీయ ఎత్తుగడ లో భాగంగా ఇలా చేస్తున్నారా..? అనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్‌తో వైరం... పార్టీకి దూరం..

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిగా బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లుగా పార్టీ వ్యవహారం మారిపోయింది. పార్టీ అధిష్ఠాన తీరును కూడా జగ్గారెడ్డి చాలా సందర్భాల్లో తప్పుబట్టారు. సీనియర్లను కాదని, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిని ఎలా అందలం ఎక్కించారని మీడియా ముఖంగా జగ్గారెడ్డి ప్రశ్నించారు కూడా. పలుమార్లు జగ్గారెడ్డితో అధిష్టాన పెద్దలు మాట్లాడారు కూడా. పార్టీ యువనేత రాహుల్ గాంధీని కుటుంబంతో కూడా కలిసి వచ్చారు. ఆ తరువాత తన పని తాను చూసుకుంటూ వెళతానని చెప్పిన జగ్గారెడ్డి కొద్దిరోజులకే మళ్లీ రేవంత్ తో వైరం పెట్టుకున్నారు.

గాంధీ భవన్‌కు, పార్టీ కార్యక్రమాలకు కూడా సరిగ్గా వెళ్లడం లేని విషయం తెలిసిందే. రాహుల్ భారత్ జోడో యాత్రను మాత్రం తన సంగారెడ్డి సెగ్మెంట్‌లో గ్రాండ్ సక్సెస్ చేయించారు. రాహుల్ కూడా జగ్గారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. తిరిగి బాగానే ఉంటున్నాడనుకునే లోపే మళ్లీ దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు వెళ్లడం లేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డిని పలకరించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం..

జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అధికార పార్టీలోని ముఖ్య నాయకులు కూడా అవును చేరే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ నెల 19న మెదక్ లో సీఎం పర్యటన నిర్ణయించగా వర్షాలు పడే అవకాశాలున్నాయని 23వ తేదికి వాయిదా వేశారు. అయితే సీఎం సభలోనైనా లేదా సభకు ముందే జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కింద తాను పనిచేయలేనని జగ్గారెడ్డి సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్లకు కనీస విలువ ఇవ్వకుండా తన ఇష్టం వచ్చినట్లు పనిచేస్తున్న రేవంత్ తో కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని కూడా ఆయన పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లు అటు కాంగ్రెస్, మరో వైపు బీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతున్నది.

జగ్గారెడ్డి మౌనం... మీడియాకు దూరం

జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ వార్తలను ఖండించడం లేదు.. మీడియా ముందుకు రావడం లేదు. అయితే గతంలో కూడా జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన మాత్రం అలాంటి వార్తను పట్టించుకోకుండా కాంగ్రెస్ లోనే కొనసాగుతా వచ్చారు. ఈసారి పార్టీ మారుతారా..? రాజకీయ వ్యూహంలో భాగంగా కేవలం ప్రచారం కోసం ఇలా చేస్తున్నారా..? అని చూడాల్సి ఉందని ఆయన సన్నిహితులు కొందరు చెబుతున్నారు. మరికొందరేమో చేరడం ఎప్పుడో ఖాయమైందని, ఏ రోజు చేరుతారోననేది మాత్రమే సస్పెన్స్ అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగ్గారెడ్డి కాంగ్రెస్ లో ఇమడ లేకపోతున్నారని, ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందడంతో ఆయన ఆ పార్టీలో చేరడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రచారం ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం మౌన ముద్రలోనే ఉంటున్నారు.

కాంగ్రెస్‌లో అయోమయం..

జగ్గారెడ్డి మార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో సంగారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ క్యాడర్ అయోమయం చెందుతున్నది. పార్టీకి ఇక్కడ మరో పెద్ద దిక్కులేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. జగ్గారెడ్డి పార్టీలో ఉంటారా..? బీఆర్ఎస్ లో చేరతారా..? అని పార్టీ లీడర్లను అడుగుతున్నారు. ఇదిలా ఉండగా జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఆ పార్టీ క్యాడర్ అలెర్ట్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు జగ్గారెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారు.

ఆయనను చేర్చుకోవద్దని మంత్రి హరీశ్​రావుకు పలు మార్లు మొరపెట్టుకున్నారు. ఈ విషయంలో మంత్రి కూడా మౌనంగానే ఉంటున్నారు. జగ్గారెడ్డి చేరిక విషయంలో తనకు సమాచారం లేదని చెప్పి పంపిస్తున్నారు. జగ్గారెడ్డి పార్టీ మారునున్నట్లు జరుగుతున్న ప్రచారం అటు కాంగ్రెస్ మరో వైపు బీఆర్ఎస్ లో పెద్ద కుంపటి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ఆయన పార్టీ మారుతారా..? తన రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రచారం కోసం ఇలా చేస్తున్నారా..? అనేది వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story