కలెక్టర్ సంతకం ఫోర్జరీ..?

by Kalyani |
కలెక్టర్ సంతకం ఫోర్జరీ..?
X

దిశ,పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి రెండు ఎకరాల భూమిని అప్పనంగా అమ్మే ప్రయత్నం చేసిన ముఠా గుట్టు రట్టు చేశారు కొల్లూరు పోలీసులు.. స్థానిక సమాచారం ప్రకారం రామచంద్రపురం మండల పరిధిలోని కొల్లూరు సర్వేనెంబర్ 191 లో 1997 సంవత్సరంలో ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండల కేంద్రానికి చెందిన ముగ్గురికి, టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి స్వాతంత్ర సమరయోధుల కోటాలో ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున భూమిని కేటాయించారు. అయితే 2003లో నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని వేరొకరికి విక్రయించడంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

అయితే మళ్లీ తిరిగి ఆ భూమిపై తమకు హక్కులు ఉన్నాయని పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఐదు మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు అమ్మకానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ భూమిని అమ్మి పెట్టడానికి ఒక ముఠా రంగంలోకి దిగింది. ముందుగా రెండు ఎకరాల భూమికి ఫేక్ ఎన్ఓసి సృష్టించి భూమిని అమ్మేలా ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారి ఒప్పందం మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్వోసీ సృష్టించి భూమి అమ్మకానికి ప్రయత్నించారు. అయితే ఈ విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు ఈ తతంగంపై కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రామచంద్రపురం తహసిల్దార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కొల్లూరు పోలీసులు అక్రమంగా ప్రభుత్వ భూమి అమ్మకానికి ప్రయత్నం చేసిన ముఠా గుట్టు రట్టు చేశారు. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి రెండు ఎకరాల భూమిని అమ్మడానికి ప్రయత్నం చేసిన నిందితులను ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు సమాచారం. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూ విక్రయానికి తెరలేపారన్న సమాచారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న కొల్లూరు పోలీసులు ఒకటి రెండు రోజుల్లో మీడియా ముఖంగా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed