కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం : మంత్రి హరీష్ రావు

by Shiva |
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రపంచంలో అతి పెద్ద కులం కార్మికుల కులం.. మనమంతా కార్మికులమే. సూర్యుడు అలసిపోకుండా నిరంతరం వెలుగునిస్తే... అలసిపోకుండా ప్రపంచానికి సేవ చేసేవాడు కార్మికుడని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మే డేని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్ లో బీఆర్టీయూ-ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు.

అంతకుముందు బీఆర్ఎస్ జెండా విష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కులం, మతం లేదన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాల రాస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను గుర్తించాల్సిన బాధ్యత అన్నీ ప్రభుత్వాలపై ఉందన్నారు. బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో బీడీలు చేసే కార్మికులను పట్టించుకోలేదన్నారు.

ఆ విషయం మహిళా మంత్రి అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. ప్రపంచానికి సూర్యుడు వెలుగునిస్తే.. కార్మికుడు తన చెమట చుక్కలతో పని చేసి అందరీ జీవితంలో వెలుగు నింపుతారని కొనియాడారు. బీడీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు రూ.6 లక్షల భీమాను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సిద్దిపేటలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వెయి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు.

త్వరలోనే ఈఎస్ఐ - డిస్పెన్సరీ కార్మికులకు కోసం తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు బతుకుతెరువు కోసం ఈ ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారి బతుకు తెరువు కోసం తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్, రాష్ట్ర కార్యదర్శి మంచే నర్సింహులు, ఎల్లు రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story