కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా రేపు మహాధర్నా: Kavita

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-22 08:02:53.0  )
కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా రేపు మహాధర్నా: Kavita
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంలో పాలు పెరుగు లాంటి రైతులు ఉత్పత్తి చేసే వాటిపై పన్నులను విధిస్తున్న కేంద్రం కార్పొరేట్ సంస్థలు తీసుకున్న 19 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో నుంచి తరలిన నల్లధనం తెస్తానని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

బ్యాంకులు దివాలా తీసేలా ఉన్నా కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రుణాలను మాఫీ చేసిన కేంద్రం రైతులు, ప్రజలు తీసుకున్న అప్పులను మాత్రం వడ్డీతో సహా వసూలు చేస్తోందన్నారు. దేశ సంపద తరలిపోతుంటే తాము జిమ్మేదారులమని, చౌకీదారులమని చెప్పిన బీజేపీ నేతలు నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అనేది ఇప్పటికే పలుమార్లు రుజువైందన్నారు. పంజాబ్‌లో ఎన్నికలొస్తే క్షమాపణలు అడగాల్సిన పరిస్థితి మోడీది అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో కల్లాల నిర్మాణాల కోసం కేటాయించిన నిధులను వెనక్కి ఇవ్వాలని కోరడం దుర్మార్గమన్నారు.

అందుకే రైతు వ్యతిరేక బీజేపీకి నిరసనగా రేపటి రైతు ధర్నాను నిజామాబాద్‌తో పాటు ప్రతీ జిల్లాలోనూ విజయవంతం చేయాలని పిలుపు‌నిచ్చారు. దేశంలో రైతుల, ప్రజల సంక్షేమ కోసం పనిచేసే పార్టీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. చుక్కలు ఎన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణ లో కేసీఆర్ ఒక్కడే అన్నారు. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవు అని కవిత వ్యాఖ్యానించారు. చంద్ర బాబు వచ్చి మళ్లి ఇక్కడ పార్టీ‌ని రివైవ్ చేయాలి అనుకుంటున్నాడని వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదన్నారు. వాళ్ళను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసారని గుర్తు చేశారు.

ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అనుకున్న మళ్లి రిజెక్ట్ చేస్తారు అని ఎమ్మెల్సీ కవిత జోష్యం చెప్పారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద రైతులు కల్లాలు కట్టుకుంటే డబ్బులు వాపస్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించడం దుర్మార్గం అన్నారు. బీజేపీ‌కి బుద్ధి చెప్పాల్సిన రోజులు వచ్చాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మార్కెట్ యార్డులో మాత్రమే కొనుగోళ్లు జరిగే ప్రాంతాల్లో ముఖ్యంగా చేపలను ఆరబెట్టడానికి కల్లాలను నిర్మించాలని నిధులు ఇచ్చారని అన్నారు.తెలంగాణలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. రైతుల కోసం తెలంగాణలో ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు నిజామాబాద్ ధర్నా చౌక్‌లో రైతు మహా ధర్నా‌కు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు తెలంగాణ‌కు పట్టిన చీడ పురుగులు అని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ‌పై అనవసర విమర్శలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బండి సంజయ్ అరవింద్‌లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈడీ దాడులు కేసులకు భయపడమన్నారు. ఎర్రకోట‌పై బీఆర్‌ఎస్ జెండా ఎగరవేస్తామన్నారు. డ్రగ్స్ టెస్టులకు అందరి వెంట్రుకలు ఇస్తామన్నారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే మాడి మసైపోతారన్నారు. అన్ని సర్వేలు మా వైపే ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు ఖాయమన్నారు.

కేంద్రం తీరుపై ఆగ్రహం.. BRS శ్రేణులకు KTR కీలక పిలుపు

Advertisement

Next Story