మూడు ముక్కలుగా చీలిన పార్టీ

by Prasanna |
మూడు ముక్కలుగా చీలిన పార్టీ
X

దిశ, మహబూబాబాద్ : మానుకోట నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటకు కేరాఫ్ గా ఉండేది. ఆది నుంచి వర్గపోరే అయినా కాంగ్రెస్ విజయఢంకా మోగించేది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలతో సీటు చేజారింది. మళ్లీ అవే తప్పిదాలు జరిగేలా కనిపిస్తుంది. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోవడమే ఇందుకు కారణంగా ఉంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక మానుకోటలో పార్టీ మరింత బలపడింది. కొత్త జిల్లాకు అధ్యక్షుడిని నియమించడంతో పాటు క్యాడర్ కూడా పదవులు రావడంతో పార్టీలో జోష్ పెరిగింది. ఈసారి ఎలాగైనా సెగ్మెంట్ ను హస్తగతం చేసుకునేందుకు అధిష్టానం పక్కా ప్లాన్ తో ఉంది. అయితే.. టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉండగా క్యాడర్ వర్గాలుగా చీలిపోయింది. ఎన్నికలు సమీపిస్తుండగా టికెట్ లొల్లి షురువైంది. కొందరు పార్టీ నేతలు సీటు నాదంటే.. నాదంటూ ఎవరికి వారు సొంత ప్రకటనలు చేసుకుంటుండగా క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.

వీరే ఆశావహులు

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఉమా మురళి నాయక్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు రాధ, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ లు టికెట్ రేసులో ఉన్నారు. అధిష్టానంతో సంబంధం లేకుండా ఎవరికి వారే సొంత ప్రచారం చేసుకుంటున్నారు. వీరి తీరుతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయింది. అయితే.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి మద్దతు తనకే ఉందని టికెట్ పక్కా అంటూ ఉమా మురళి నాయక్ కు నమ్మకంతో ముందుకెళ్తున్నారు. బలరాం నాయక్ కు రాహుల్, సోనియా గాంధీతో సత్సంబంధాలు ఉండగా తనకే టిక్కెట్ ఖాయమని చెప్పకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గిరిజన నేతగా బెల్లయ్య నాయక్ కు పార్టీలో గుర్తింపు ఉండగా తనకే బి ఫామ్ అనే ధీమాతో దూసుకెళ్తున్నారు. మహిళ కోటాలో తనకే టికెట్ అంటూ రాధ సైతం తనదైన శైలిలో వెళ్తున్నారు. దీంతో ఎవరితో నడవాలో పార్టీ క్యాడర్ కు అర్థంకాని పరిస్థితి నెలకొంది.

రాష్ట్రం ఇచ్చిన పార్టీగా

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారైనా ఓటు వేయాలనే కోరిక నియోజకవర్గ ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కూడా వచ్చే ఎన్నికల్లో హస్తానికి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. దీంతో మానుకోటలో రోజురోజుకూ కాంగ్రెస్ బలం పెరుగుతుంది. కానీ వర్గపోరు మాత్రం పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇప్పటికైనా అధిష్టానం దృష్టిసారింది ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించి, ఆశావహులను బుజ్జగించాల్సిన అవసరం ఉంది.

Also Read..

సారుకు ఫికర్! పార్టీ పరిస్థితులపై గులాబీ బాస్‌కు టెన్షన్

Advertisement

Next Story

Most Viewed