వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు... చివరికి డ్రైనేజీలలో కూడా..

by S Gopi |
వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు... చివరికి డ్రైనేజీలలో కూడా..
X

దిశ, ప్రతినిధి వనపర్తి: పర్యావరణానికి తీవ్రంగా హాని కలిగించే ప్లాస్టిక్ ను నిరోధించడంలో, నిషేధాన్ని అమలు చేయడంలో మున్సిపల్ అధికారులు విఫలం కావడంతో కాలుష్యభూతం కమ్మేస్తోంది. జిల్లా కేంద్రంలో రహదారులు మురుగు కాలువల వెంట ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అధికారులు పాలిథీన్ కవర్ల నిషేధాన్ని కఠినంగా అమలు చేయకపోవడంతో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా హాని కలిగించే నాసిరకం కవర్లను ఉపయోగిస్తూ ప్రకృతి మరింత కాలుష్యంగా మారడానికి కారకులవుతున్నారు.



కంటితుడుపు చర్యలు...

మానవ అవసరాల నిమిత్తం మార్కెట్లోకి తీసుకొచ్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ మనుగడకే ముప్పుగా మారింది. వనపర్తిలో నిబంధనలకు విరుద్ధంగా, లాభార్జనే ధేయంగా వ్యాపారులు విచ్చలవిడిగా నాసిరకం పాలిథీన్ కవర్లను, బాటిళ్లను విక్రయిస్తుండడంతో పట్టణం మొత్తం అపరిశుభ్రంగా మారిపోతుంది. వనపర్తి మున్సిపాలిటీలో దాదాపు దశాబ్దం కిందటనే పాలిథీన్ కవర్ల వాడకం నిషేధిస్తూ తీర్మానం చేశారు. 60 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉన్న కవర్లను విక్రయించడానికి వీలులేదని కేవలం రీసైక్లింగ్ చేయడానికి వచ్చే పాలిథీన్ కవర్లను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిని అమలు చేయవలసిన మున్సిపల్ అధికారులు మాత్రం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో వ్యాపారులు యథేచ్ఛగా నాసిరకం కవర్లను విక్రయిస్తున్నారు. పలుమార్లు పత్రికలలో నిషేధంపై వార్తలు వచ్చినప్పుడు మాత్రం కంటి తుడుపు చర్యగా అధికారులు కొన్ని వ్యాపార సంస్థలపై దాడులు చేసి నామమాత్రం జరిమానా విధించి వదిలేస్తున్నారు. మళ్లీ పది రోజులకు యథావిథంగా వ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వేలాది సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఉన్నా కేవలం కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కిరాణం షాపులు, సూపర్ మార్కెట్లలో మాత్రమే నిబంధనల మేరకు మందంపాటి పాలిథీన్ కవర్లను ఉపయోగిస్తున్నారు.

విచ్చలవిడిగా వినియోగం...

జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ వస్తువులు పాలిథీన్ కవర్లను షాపులు అనేకంగా పుట్టుకొచ్చాయి. మున్సిపల్ అధికారులు నాసిరకం కవర్లపై నిషేధం విధించినప్పటికీ వ్యాపారులు తమ లాభాల కోసం తక్కువ మందం ఉన్న కవర్లు, నలుపు, ఇతర రంగులతో ఉన్న కవర్లను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. వీరితో కొనుగోలు చేసిన కిరాణా షాపుల యజమానులు సైతం వాటిని చిరు వ్యాపారులకు విక్రయిస్తుండడంతో కూరగాయలు, నిత్యవసరాల సరుకులను వాటిలోని ప్యాక్ చేసేస్తున్నారు. చివరికి పాలు, పెరుగు సైతం పాలిథీన్ కవర్లలోనే సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు కూడా వాటి నుంచి వచ్చే ముప్పును గ్రహించక అలాగే వినియోగించుకుంటున్నారు.




పర్యావరణానికి ముప్పుగా....

ప్లాస్టిక్ వస్తువులు పాలిథీన్ కవర్లను విచ్చలవిడిగా వినియోగించి ఎక్కడపడితే అక్కడ పార వేస్తుండడంతో అది పర్యావరణానికి ముప్పుగా మారుతుంది. ముఖ్యంగా వనపర్తి పట్టణంలో ఖాళీ స్థలాలు రోడ్లపై ఎక్కడ చూసినా పాలిథీన్ కవర్లు, వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు కనిపిస్తున్నాయి. చివరికి డ్రైనేజీలలో సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు నిండిపోయి మురుగునీరు పారకుండా నిలిచి పోతుంది. దీంతో తీవ్ర దుర్గంధం వెలు పడడంతోపాటు దోమలు పందులకు ఆవాసంగా మారాయి. తరచూ మురికి కాలనీ శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో పట్టణంలో చాలావరకు మురుగు కాల్వలు పాలిథీన్ వ్యర్థాలతో నిండిపోయాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ పై నిషేధాన్ని కఠినంగా అమలు చేసి కాలుష్య భూతాన్ని తరిమివేయాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యాపారులకు గడువిచ్చాం.. వెంటనే దాడులు చేసి నియంత్రిస్తాం: విక్రమసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వనపర్తి

వర్తక సంఘంతోపాటు ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వ్యాపారులతో ఇటీవల సమావేశం నిర్వహించాం. వారికి పక్షం రోజులు గడువు ఇవ్వడం జరిగింది. వెంటనే షాపులపై దాడులు చేసి జరిమానాలు విధిస్తాం. ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయడంతోపాటు కాగితపు కవర్లు ఇతర పర్యావరణహితంగా ఉన్న సంచులను వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story