ఆరు గ్యారంటీలు అమలు ఎక్కడో చూపండి : ఎంపీ

by Naveena |
ఆరు గ్యారంటీలు అమలు ఎక్కడో చూపండి : ఎంపీ
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు అవుతున్నాయే చూపించాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ఆరు గ్యారంటీలలోని ఉచిత బస్సు ప్రయాణం,గ్రామీణ పేద ప్రజలకు శాపంగా మారిందని,గ్రామాలకు ఉన్న బస్సు సౌకర్యం తీసేశారని,మరికొన్ని గ్రామాలకు బస్సులను తగ్గించి వేశారని ఆమె ఆరోపించారు. వితంతువులకు కొత్త పెన్షన్ యాడుందని,రైతులకు రైతు బంధు ఎక్కడని,ఆసరా పెన్షన్ 4 వేల రూపాయల పెంపు ఎక్కడికి పోయిందని,కళ్యాణ లక్ష్మీ కింద ఇస్తామన్న తులం బంగారం ఎక్కడిచ్చారని ప్రశ్నించారు. అలాగే మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఎవరికిచ్చారని,మీరిస్తానన్న ఇందిరమ్మ ఇళ్ళు జాడ యాడుందని ఆమె నిలదీశారు. ప్రతి గింజకు 500 బోనస్ అని ప్రకటించి,ఇప్పుడు 'సన్నాలకు' మాత్రమే అంటున్నారని,హామీలన్నింటినీ మసిపూసి మారెడికాయలతో మాయలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. జడ్చర్ల నియోజకవర్గంలో 15 రోజులుగా రైతులు రోడ్లమీద ఉన్నారని,ధాన్యం తేమ ఉందని,తూర్పు పట్టాలని అధికారులు కండీషన్లు పెడుతున్నారని,ప్రతి క్వీంటాలుకు రెండున్నర కిలోల తరుగు తీసేసి రైతులను మిల్లర్లు సతాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా గుర్తించి.. సమస్యలను పరిష్కరించాలని ఆమె సూచించారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి,నాగురావ్ నామోజీ, బురుజు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed