రసవత్తరంగా కొల్లాపూర్‌ రాజకీయాలు

by Mahesh |
రసవత్తరంగా కొల్లాపూర్‌ రాజకీయాలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ రాజకీయాలు ఎన్నికల సమయానికి ముందే మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార పార్టీలో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు, మూడు రోజుల నుంచి స్థానిక నేతలతో పాటు, ప్రభుత్వంపై కూడా ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.. ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతి... రైతులకు జరిగిన అన్యాయాలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్నప్పటికీ... అధికార పార్టీని వీడుతున్నట్లు జూపల్లి ఎక్కడ కూడా ప్రకటించలేదు.. నమ్మకంతో ఉన్నాడు.

కానీ... సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మధ్య ప్రకటించినప్పటికీ.. జూపల్లి కృష్ణారావు ఎక్కడ కూడా నోరు జారకుండా ... పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే... ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువగా ఉంటూ వచ్చారు. ఒకానొక సందర్భంలో వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా జూపల్లి టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ.. కొన్ని ప్రత్యేక కారణాలతో ఆయన టికెట్ వచ్చే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లి పోవడంతో.. తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ఆయన దాదాపుగా అధికార బీఆర్ఎస్ పార్టీని వీడినట్లే అని తేలిపోయింది.

ఆదివారం కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు అక్కడికి తన అనుచర గణంతో వెళ్లి ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగానే జూపల్లి జాతీయ పార్టీలలో ఏదైనా ఒక దానిలో చేరుతారు అని భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జూపల్లి కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని రెండు మూడు రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఓ నేత ప్రత్యేక సమావేశం..

జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని ప్రచారం జరిగిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు తన అనుచరగణంతో ఆగమేఘాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. జూపల్లి వచ్చినా టికెట్ నాకే వస్తుందనే భరోసాను తన అనుచర గణానికి కలిగించే ప్రయత్నాలు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మార్పులు, చేర్పులు తథ్యం..

జూపల్లి కృష్ణారావు వీలైనంత త్వరలోనే కాంగ్రెస్, లేదా బీజేపీలో చేరవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఆయన ఏ పార్టీలో చేరిన ఇప్పటిదాకా టికెట్లు ఆశిస్తూ వస్తున్న నేతలు పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూపల్లికి ఈ రెండు పార్టీలలో చేరే అవకాశం లభించకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.. ఏది ఏమైనా కొల్లాపూర్ రాజకీయాలు రసవత్తరంగా మారడం తథ్యమని అని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed