Minister Thummala : ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణమాఫీ చేస్తాం

by Kalyani |
Minister Thummala : ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణమాఫీ చేస్తాం
X

దిశ, అలంపూర్ టౌన్: ఎన్ని అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదురైనా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులను కాపాడుకుంటామని వెల్లడించారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రుల సమక్షంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పుష్పమ్మ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉప్పరి దొడ్డప్ప, వైస్ చైర్మన్ గా కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక సమస్యలు, ఒడిదుడుకుల మధ్య ఉన్న ఇచ్చిన మాట ప్రకారం అడ్డంకులను దాటుకుంటూ రైతులకు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్ల రూపాయలను వారి ఖాతాలో వేసినట్లు తెలిపారు. తెల్ల కార్డు లేని మూడు లక్షల మంది రైతులకు కూడా ఈ నెల చివరికి వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. రుణమాఫీ కోసం అనేక నిబంధనలు పెట్టామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఆంక్షలు లేని రుణమాఫీ తమ లక్ష్యం అన్నారు. రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. రుణమాఫీ అనంతరం రైతు భరోసాను కూడా విడుదల చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

అందులో భాగంగా అలంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం చేయడం కోసం మల్లమ్మ కుంట రిజర్వాయర్ ను పూర్తి చేస్తామని వెల్లడించారు. గద్వాల జిల్లా విత్తన పత్తికి దేశంలోనే మంచి డిమాండ్ ఉంద, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ఉండే విధంగా రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అయితే తెలంగాణ యావత్తు సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఐజ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టిసారిస్తామని మంత్రి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం, ఉద్యోగం అందేలా చూస్తామన్నారు.

బీచుపల్లి ఆయిల్ మిల్లును వచ్చే ఏడాది కల్ల రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… పాలమూరు జిల్లా వాసుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. మార్కెట్ యార్డ్ పాలకమండలి అనునిత్యం రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలు తీర్చాలని సూచించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంపత్ కుమార్ తో కలిసి ఐదవ శక్తిపీఠంమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మంత్రులకు జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అలంపూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ గౌడ్, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఆర్డిఓ రామచందర్, మార్కెటింగ్ ప్రాంతీయ ఉపసంచాలకులు ప్రసాదరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed