Collector BM Santosh : మెడికల్ కళాశాల పనులను వేగవంతం చేయాలి..

by Sumithra |
Collector BM Santosh : మెడికల్ కళాశాల పనులను వేగవంతం చేయాలి..
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో నూతన మెడికల్ కళాశాలకు సంబంధించిన పనుల పురోగతి పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్పిటల్‌లో ఉన్న పోస్టుల వివరాలు, అర్హతలు తెలియజేసినట్లయితే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు వీలు పడుతుందన్నారు. అవసరమైన పరికరాలతో పాటు హాస్పిటల్స్ లోని బెడ్స్, ఇతర వైద్య ఎక్విప్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించుకోవాలని సూచించారు. అవసరం మేరకు పరికరాలను అలంపూర్ ఆసుపత్రి నుండి తెప్పించాలన్నారు. మెడికల్ కాలేజీలో ప్రొఫెషనల్ అధ్యాపకులు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మెడికల్ కాలేజీలకు కావాల్సిన నీరు, విద్యుత్తు వంటి అన్ని వసతులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని, అందరూ సమష్టిగా పని చేసి, మెడికల్ కళాశాలను త్వరగా సిద్దం చేయాలన్నారు. సమావేశం అనంతరం పట్టణ శివారులో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాలేజీలో ఉన్న వసతులను పరిశీలించారు. మెడికల్ కళాశాలకు అనుమతుల అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్లు సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. డిపార్ట్మెంట్ వారిగా అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పనులలో అవసరమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి వెంటనే తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పార్వతి, డిప్యూటీ డీఏంహెచ్ఓ సిద్దప్ప, హాస్పిటల్ సుపెరిండెంట్ డాక్టర్ నవీన్ క్రాంతి, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డా.వృశాలి, మిషన్ భగీరథ ఈ.ఈ భీమేశ్వర్ రావు, ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, కళాశాల మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed