'దేశంలో కాదు.. నీ రాష్ట్రంలో ఎంత వరకు నీతివంతమైన పాలన అందిచావు'

by S Gopi |
దేశంలో కాదు.. నీ రాష్ట్రంలో ఎంత వరకు నీతివంతమైన పాలన అందిచావు
X

దిశ, మహబూబ్ నగర్: మీ పదవులకు మీరు రాజీనామా చేయవలసిన పనిలేదని, ప్రజలే మిమ్మల్ని వచ్చే ఎన్నికలలో ఇంటికి పంపిస్తారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని తమ సొంత రాజ్యాంగంగా భావిస్తున్నారని, అందిన కాడికి దోచుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేక ఆ నిందలను కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రిపై వేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. తమ పాలన దేశానికి మార్గదర్శకం, అన్ని రాష్ట్రాలకు అవసరం అని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారని మంత్రి ఎద్ధేవా చేశారు. దళితులను దగా చేశారని, నిరుద్యోగులను మోసం చేశారని, ఉద్యోగులకు జీతాలు లేకుండా చేసి ఆ తప్పులు తమపై ఎక్కడ పడతాయో అని, ఎంతసేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని మంత్రి వర్గానికి ఆరోపణలు చేయడం తప్ప అభివృద్ధి చేత కాదని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో చట్టబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, వివిధ పార్టీల నుండి గెలిచినవారిని తమ పార్టీలో చేర్చుకుని, తమ ఎమ్మెల్యేలు జాతి రత్నాలు అని చెప్పుకున్న ఘనత ఈ ముఖ్యమంత్రి కే చెల్లుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చివరకు ఉపాధ్యాయ, విద్యా సంబంధ సమస్యలపై ప్రభుత్వంతో పోరాడవలసిన ఎమ్మెల్సీలను సైతం నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్వేచ్ఛ లేదని, తాము చెప్పిందే చేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నది ఈ పాలకులు కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభ ప్రగతి భవన్ కలుసన్నలలో నడుస్తుందని, ఎన్నికలు సైతం కలుషితమయ్యాయని, గవర్నర్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఈ నేతలు వ్యవహరిస్తున్నారని, సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని ఆయన మండిపడ్డారు.

సామాన్య ప్రజానీకానికి ప్రగతి భవన్ కి వెళ్లడానికి అవకాశం లేదని, కానీ ఎంఐఎం లీడర్లు మాత్రం మోటార్ సైకిల్ పై నేరుగా సీఎం బెడ్ రూమ్ వరకు వెళ్తారని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తాము నీతివంతులుగా చెప్పుకుని, అవసరమైతే రాజీనామాలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రి వర్గం చెబుతోందని, దేశంలో నీతివంతమైన పాలనను అందిస్తాం అంటున్నారని, ఈ రాష్ట్రంలో ఏ మేరకు నీతివంతమైన పాలన అందుతుందో ఒక్కసారి పురానాలోచన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శాంతి కుమార్, పద్మజా రెడ్డి, శ్రీ వర్ధన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎగ్గని నర్సింలు, ఎన్ పీ వెంకటేష్, జయశ్రీ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed