ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

by Naveena |
ఇందిరమ్మ ఇళ్ల  నిర్మాణాలను వేగవంతం చేయాలి
X

దిశ, నారాయణ పేట ప్రతినిధి: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళ వారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ హౌసింగ్, డిఆర్డిఏ, విద్యాశాఖ, ఆరోగ్య, పీఆర్, డీపీవో, మున్సి పల్ శాఖల అధికారులతో ఆయా శాఖల ప్రగతి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సొంత స్థలాలు ఉన్న 859 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, వాటిలో ఇంత వరకు ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయని అడిగారు. స్పందించిన హౌసింగ్ పీడీ శంకర్ ఇప్పటి వరకు 165 గ్రౌండింగ్ అయ్యాయని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లా 6 వ స్థానంలో ఉందని తెలిపారు. మిగతా ఇండ్ల నిర్మాణాలను కూడా త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా సెర్ఫ్ కు సంబంధించి మహిళలకు సోలార్ పవర్ ప్లాంట్లు, బస్సులు, న్యూ ఎంటర్ ప్రైజెస్ ఎంత వరకు వచ్చాయని కలెక్టర్ డిఆర్డిఓ మొగులప్పను అడిగి తెలుసుకున్నారు. అయితే బ్యాంక్ లింకేజీలో రాష్ట్రంలో మన జిల్లా ర్యాంకు 32 వ స్థానంలో ఉండటoపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేని ఏపిఏంలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిఆర్డిఓ ను ఆదేశించారు. 2025-26 సంవత్సరానికి విద్యార్థులకు పంపిణీ చేసే స్కూల్ యూనిఫాంల కుట్టే ప్రక్రియ పై ఆమె చర్చించారు. 2024-25 లో జరిగిన పొరపాట్లు,లోటు పాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డిఆర్డిఎ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ లు గడువులోపు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన రోడ్లు పంచాయతీ భవనాలు, అంగన్వాడి కేంద్రాల వివరాలను కలెక్టర్ పిఆర్ ఈ ఈ హీర్యా నాయక్ ను అడిగి, వెంటనే మిగిలిన పనులను పూర్తి చేయాలన్నారు. పదో తరగతి పరీక్ష ఏర్పాట్లు, బాబుజి జాతర పనులు, ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్, ఈజీఎస్ పనుల గురించి శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు . గడువులోపు పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Next Story