టికె‌ట్ వస్తే సరి లేదంటే తిరుగుబాటే.. సన్నద్ధం అవుతున్న సీనియర్లు

by Hamsa |
టికె‌ట్ వస్తే సరి లేదంటే తిరుగుబాటే.. సన్నద్ధం అవుతున్న సీనియర్లు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచాం.. అధిష్టాన వర్గం తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి టికెట్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు బాహాటంగా చెబుతున్నారు. పార్టీ అధిష్టానం సర్వేలు, సామాజిక వర్గాలు, ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొనే సమర్థత ఉన్న వాళ్లకే టికెట్లు కేటాయిస్తాం.. ఇందుకు సీనియర్లు.. జూనియర్లు అన్న తేడాలు ఉండవు అని అధిష్టానం ప్రకటించింది. కానీ సీనియర్లు ఈ విషయాన్ని కొట్టి పారవేస్తున్నారు.

పార్టీకి కష్టకాలంలో ఎవరు అండగా నిలిచారో వారికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఇటీవల పార్టీలో చేరిన యువ నాయకుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్లు పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. పలుమార్లు తనను ఓడించి ఇబ్బందులకు గురిచేసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీమంత్రి,ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావుకు దాదాపు టికెట్ ఖరారు కావడంతో.. అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత జగదీశ్వరరావు నిరాశతో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారం కోసం అవసరమైన ప్రచార రథాలను సిద్ధం చేసుకుని ఉన్నారు. టికెట్ రాకుంటే స్వతంత్ర్య అభ్యర్థిగా అయినా పోటీలో ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పాలమూరు నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి పీసీసీ ఉపాధ్యక్షులు కొత్వాల్,సంజీవ్ ముదిరాజ్,వినోద్ కుమార్, నాయకులు రాఘవేంద్ర రాజు,ఎన్పీ వెంకటేష్ ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎన్.ఎం శ్రీనివాస్ రెడ్డి తదితరులు టికెట్ ఆశించారు.

కానీ వీరిలో టికెట్ రాదని భావిస్తున్న కొంతమంది నాయకులు అధిష్టానం నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. నారాయణపేట నియోజకవర్గం లో టిక్కెట్ ఆశిస్తూ వచ్చిన మాజీ డీసీసీ అధ్యక్షుడు శివ కుమార్ రెడ్డికి కాకుండా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కు టికెట్ ఖరారు అయ్యిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శివ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చిన ఊరుకునేది లేదని శివ కుమార్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీలో ఉండాలని శివకుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మక్తల్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరికి కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలుమార్లు టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన శ్రీహరి ఈసారి కూడా టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గౌడ్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

వీరిలో ఎవరికి టికెట్ వచ్చిన రెండో వారు తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు తమకు జరుగుతున్న అన్యాయంపై కొంతమంది స్వయంగా కలిసి, మరి కొంతమంది ఫోన్లలో మాట్లాడుతూ తమ ఆవేదనలను వ్యక్తం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ రెండు మూడు రోజులలో సీనియర్లు అందరూ సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం పై కాంగ్రెస్ రాజకీయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ కాక రేపుతున్నాయి.

Advertisement

Next Story