హీటెక్కిన పాలమూరు రాజకీయం.. దడ పుట్టిస్తున్న సర్వే నెం.523

by Shiva |
హీటెక్కిన పాలమూరు రాజకీయం.. దడ పుట్టిస్తున్న సర్వే నెం.523
X

దిశ ప్రతినిధి, మహబూ‌బ్‌నగర్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ముగిసి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాలమూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఆరంభమైన మాటల యుద్ధం ఇప్పుడు మరింత హీట్‌ను పుట్టిస్తోంది. మహబూబ్‌నగర్ పట్టణం క్రిస్టియన్‌పల్లి సమీపంలో ఉన్న సర్వే నెం.523 భూములు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. సర్వే నెం.523లో 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి ఇళ్ల పట్టాలను ఇచ్చారు. అయితే, ఇక్కడ కొంతమంది నిరుపేదలు ఇండ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు.

అదే స్థలంలో కొందరు ఇళ్లను నిర్మించుకోపోవడంతో అక్రమార్కుల కన్ను ఆ ప్రభుత్వం స్థలంపై పడింది. కొంతమంది దళారులు అధికార పార్టీ నేతల అండదండలతో ప్లాట్లను చేసి విక్రయించారు. ఇదే విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పలుమార్లు ఇళ్లను కూల్చడం, మళ్లీ ఆక్రమణలు జరుగుతూనే వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ హయాంలో సర్వేనెం.523లోని భూములు ఆక్రమణకు గురయ్యాయని నిర్ధారణకు వచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం సైతం సర్వే నెం.523లోని దాదాపు 75 ఇండ్లను కూల్చివేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పేదలు, వికలాంగుల ఇండ్లను కూల్చివేయడం సరికాదని అన్నారు.

కొన్ని రోజుల పాటు నిరాశ్రయులకు భోజన సదుపాయాలు కూడా కల్పించారు. ఇటీవల తిమ్మాజిపేట మండలానికి వచ్చిన కేటీఆర్ సైతం ఆ భూముల వ్యవహారంపై స్పందించారు. పేదల ఇండ్లను కూల్చివేయడం పద్ధతి కాదంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే సర్వే నెం.523కు సంబంధించి దొంగ సర్టిఫికెట్లు సృష్టించి వాటిని విక్రయించారన్న ఆరోపణలతో పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. రిమాండ్ అయిన వ్యక్తులు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ సహకారంతోనే మేము ఇలా చేశామని పోలీసుల ముందు చెప్పడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి శ్రీకాంత్‌గౌడ్‌పై నమోదైన కేసును ఎత్తివేయపోతే 10వేల మందితో ఆందోళన చేస్తామని ఆ పార్టీ నేతలు రాజేశ్వర్ గౌడ్, గంజి వెంకన్న, కేసీ నర్సింహులు తదితరులు పేర్కొన్నారు. కాగా, మంగళవారం కాంగ్రెస్ నేత సురేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. సర్వే నెం.523‌ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయంగా వేడిని పుట్టిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed