ధరణిలో మ్యాప్‌లను మార్చిన రెవెన్యూ అధికారులు.. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమికి ఎసరు

by Shiva |
ధరణిలో మ్యాప్‌లను మార్చిన రెవెన్యూ అధికారులు.. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమికి ఎసరు
X

దిశ, హుజూర్‌నగర్: రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు అప్పట్లో మాన్యువల్‌గా ఉండటంతో అధికారులు రికార్డుల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండేవారికి వంతపాడుతూ.. రికార్డులను తారుమారు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేసేవారు. అలాంటి అక్రమాలను గుర్తించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాన్యువల్ రికార్డుల స్థానంలో ఆన్‌లైన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం రెవెన్యూ వ్యవస్థ అంతా పగడ్బందీగా ఉండాలని భూ ప్రక్షాళన పేరుతో అసలు భూములు ఎక్కడ ఉన్నాయి? నిజమైన రైతులు సేద్యం చేస్తున్నారా.. ఆ భూములు ఎవరు ఆధీనంలో ఉన్నాయి అనే అంశాలపై సమగ్ర సర్వే చేసి ధరణి వెబ్‌సైట్‌ను తీసుకొచ్చారు. అందులో అసలైన వారిని గుర్తించి ఎక్కడ ఎటువంటి లొసుగులు లేకుండా రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేలా పగడ్బందీ చర్యలు చేపట్టారు.

సీసీఎల్ఏ కమిషనర్ ఎవరిని నియమిస్తే ఎలాంటి అవకతవకలు జరుగుతాయని భావించిన అప్పటి సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్‌‌కు సీసీఎల్ఏ కమిషనర్‌గా నియమించారు. భూమి రికార్డుల విషయంలో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఉన్నప్పటికీ ఏదో చిన్న లోపం చూపించి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం శివారులోని సర్వే నెం.313లోని ప్రభుత్వ భూమి 24 ఎకరాల 05 గుంటలు ధరణి వెబ్‌సైట్ వెళ్లాక 14 ఎకరాలు 5 గుంటలుగా మారింది. ఈ క్రమంలోనే గ్రామంలో చాలా సర్వే నెంబర్లలో ఇలాంటి అవకతవకలు జోరుగా జరిగాయని అక్కడి ప్రజల్లో చర్చ మొదలైంది.

మ్యాప్‌ను కూడా మార్చేశారు

గతంలో ఉన్న 24 ఎకరాల 5 గుంటల భూమికి గాను ప్రస్తుతం ధరణి మ్యాప్‌లో 14 ఎకరాల 5 గుంటల భూమిగా చూపిస్తుంది. ఆ భూమిలో గుట్టలు ఉండటంతో అది మైనింగ్‌కు ఉపయోగపడే రాయిగా అక్కడున్న క్రషన్ యజమానులు గుర్తించారు. అయితే ఆ ప్రభుత్వం భూమిని లీజుకు కేటాయించాలంటూ క్రషర్ మిల్లులకు సంబంధించిన వ్యక్తులు పలుమార్లు ఎమ్మార్వో ఆఫీసుతో పాటు మైనింగ్ శాఖలో దరఖాస్తు చేసుకున్నారు. అదే క్రమంలో రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి పలు సందర్భాల్లో సర్వే రిపోర్టు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ రిపోర్టుతో పాటు అప్పటి మ్యాప్‌ను, ప్రస్తుతం ధరణిలో ఉన్న మ్యాప్‌తో పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ధరణి మ్యాప్‌ను మార్చేందుకు వెనుక రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారుల హస్తం ఉందనే విషయం స్పష్టం వెల్లడవుతోంది.

మైనింగ్ ప్రాంతంపై అక్రమార్కుల కన్ను

రూ.కోట్ల విలువైన మైనింగ్ ప్రాంతాన్ని దక్కించుకున్నందుకే ధరణిలో రాజ్యలక్ష్మి రోబో సాండ్ వారే మార్పులు చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అందుకు అప్పటి తహసీల్దార్‌తో పాటు కలెక్టర్ సీసీఎల్‌ఏ అధికారులంతా వారికి అండగా నిలిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రభుత్వ భూమిని ల్యాండ్ రాజ్యలక్ష్మి రోబో సాండ్ వారికి అప్పగించినందుకు అప్పట్లో వారికి భారీగా ముడుపులు అందాయని ఆరోపణలు కూడా ఉన్నాయి . అప్పట్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వారికి సపోర్ట్ చేయడంతో అధికారులు కూడా ధరణిలోని మ్యాప్‌లను మార్పులు చేశారని చర్చ జరుగుతోంది. ఆ విషయంలపై సంబధింత అధికారులుపై వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు కోరుతున్నారు.ధరణిలో మ్యాప్‌లు మార్చిన రెవెన్యూ అధికారులు.. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమికి ఎసరు

గతంలో ప్రభుత్వ భూమి ..ఇప్పుడు పట్టా భూమి

ధరణిలో ప్రస్తుతం చూపిస్తున్న 14 ఎకరాలు 5 గంటల భూమి గతంలో ప్రభుత్వ భూమి‌గానే రికార్డుల్లో కొనసాగింది. 2018 సంవత్సరంలో సంవత్సరంలో నల్లబోలు నర్సిరెడ్డి అనే వ్యక్తి ఈ సర్వే నెంబర్ 313లో 2-50 హెక్టార్ల ప్రభుత్వ భూమి తమకు లీజుకు కావాలని అప్పటి తాహసిల్దార్ వి.జయశ్రీకి దరఖాస్తు చేసుకున్నాడు. అప్పుడు ఆమె సర్వే నెంబరు పరిశీలించి అక్కడ 24 ఎకరాల 5గుంటల భూమి ఉందని అందులో 14 ఎకరాల 5 గుంటల భూమి ప్రభుత్వ భూమి గుట్టలు సాగుకు పనికిరాని ఉందని దీనికి లీజుకి ఇవ్వవచ్చునని రిపోర్టు కూడా ఇచ్చింది. ఆ తర్వాత 2021 సంవత్సరంలో రాజ్యలక్ష్మి రోబో సాండ్ వారు 313 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమి 4 హెక్టార్లను తమకు కేటాయించాలని అప్పటి తహసీల్దార్‌, మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అదే భూమి సర్వే కూడా చేసి మైనింగ్ అధికారులు కూడా ప్రభుత్వ భూమి అని నివేదిక అందించారు. ప్రస్తుతం రికార్డులో అదే భూమి రాజ్యలక్ష్మి రోబో సాండ్ పేరుతో పట్టా చూపిస్తుంది. పట్టా చేసిన సమయంలో ఎమ్మార్వో డిజిటల్ సైన్ చేయవలసి ఉంది. కానీ, అక్కడ తహసీల్దార్ డిజిటల్ సైన్ చేయవలసి ఉంది. ధరణి రికార్డు పరిశీలిస్తే అక్కడ ఏ తహసీల్దార్ కూడా సంతకం చేసినట్లుగా లేదు. అయితే, వారు పట్టా పొంది భూమిని నాలా కన్వర్షన్‌కు మార్చుకున్నారు.

రాజ్యలక్ష్మి రోబో సాండ్ డాక్యుమెంట్ కరెక్టేనా.

రాజ్యలక్ష్మి రోబో సాండ్‌కు సంబంధించిన డాక్యుమెంటల్‌లో ఉన్న హద్దులను పరిశీలిస్తే ఆ డాక్యుమెంట్ కరెక్టేనా కాదా అనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది. వారికి కొనుగోలు డాక్యుమెంట్ ఉన్నదే తప్ప ఆ భూమి ఎక్కడ ఉంది అనేది స్పష్టత లేదు. వారి వీరి డాక్యుమెంట్ హద్దులను పరిశీలిస్తే ఫీల్డ్ మీద ఉన్న హద్దులకు మీరు పెట్టుకున్న హద్దులకు సంబంధం లేకుండా ఉన్నాయి. అయితే, గతంలో ఆ భూమిలో ఉన్న వ్యక్తి మంత్రిప్రగడ మట్టపల్లి నరసింహ‌రావు ఆయన కుమారుడు మంత్రి ప్రగడ సుందర రాఘవరావు కూడా ఎప్పుడు భూమిలో సేద్యం చేసిన దాఖలాలు లేవు. కేవలం వారు పట్టాదారులు మాత్రమే. అనంతరం ఆ భూమిని బాల్‌రెడ్డి కొనుగోలు చేసి డాక్యుమెంట్ చేయించుకున్నాడు. ఆయన కూడా ఎలాంటి సేద్యం చేయలేదు. ఆ డాక్యుమెంట్‌పైనే రాజ్యలక్ష్మి రోబో సాండ్ వారి భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చే ప్రయత్నం చేశారు.

ప్రజలకు అనేక అనుమానాలు..

సర్వేనెంబర్ 313 లోని 24 ఎకరాల 5 గుంటల భూమికి సంబంధించి ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మంత్రిప్రగడ మట్టపల్లి నరసింహరావుకు 10 ఎకరాల భూమి ఎలా కేటాయించారు. అలాగే ఆ భూమి పట్టా భూమిగా ఎలా మారిందో ఇప్పటి వరకు స్వస్థత లేదు. రికార్డులో భూమి ఉన్నా ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి ఎందుకు తొలగించ లేదని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండానే మంత్రి ప్రగడ సుందర రాఘవరావు పేరు మీదికి అప్పటి వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న భూమి పట్టాభూమి ఎలా మార్చారు.. ప్రభుత్వ భూమికి డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు.. డాక్యుమెంట్లలో హద్దులు చూడకుండానే రిజిస్ట్రేషన్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

డాక్యుమెంట్ హద్దులను గమనిస్తే ఫీల్డ్ మీద‌ హద్దులకు సంబంధం లేకుండా ఉన్నాయి. దాని ప్రకారం డాక్యుమెంట్ తప్పుగానే ఉందని.. రాజ్యలక్ష్మి రోబో స్టాండ్‌కు పాస్ పుస్తకం ఇచ్చిన సమయంలో ఎమ్మార్వో డిజిటల్ సైన్ లేకుండానే పాస్‌బుక్ ఎలా ఎచ్చారో అర్థం కావడం లేదు. 24 ఎకరాల 5 గుంటల భూమిని 10 ఎకరాల 5 గుంటలుగా ధరణిలోని ఆర్‌ఎస్‌ఆర్‌తో పాటు మ్యాప్‌ను ఎలా మార్చగలిగారనే సందేహాం కలుగుతోంది. రూ.కోట్లు విలువ చేసే మైనింగ్ భూమిని కాజేసేందుకు అక్రమార్కులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా.. చూసీ చూడనట్లు వదిలేస్తారా వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed