Tiffins : 'దోశ' ఆయన దశనే మార్చేసింది

by Sumithra |
Tiffins : దోశ ఆయన దశనే మార్చేసింది
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : 'దోశ' ఆయన దశనే మార్చేసింది. దోశ ఏమిటి దశను మార్చడమేమిటని మీరనుకుంటున్నారా ? అవును ఇది నిజమే, నమ్మాలంటే ఇది చదవాల్సిందే. జిల్లా కేంద్రంలోని బండ్లగేరికి చెందిన ఆనంద్ కుమార్ 'దోశ బండి' పేరుతో ఒక చిన్న టిఫిన్ సెంటర్ ను 2018లో జిల్లా కేంద్రం పద్మావతి కాలనీ జాతీయ రహదారి పై తన భార్య రజినీతో కలిసి ప్రారంభించారు. అప్పట్లోనే 120 రకాల దోశలను వేసేవాడు. కాలక్రమేణ ఆయన దోశల రుచికి, శుచికి గిరాకీ పెరిగి. వాటి కోసం 'క్యూ' కట్టాల్సిన పరిస్థితి ఎదురైంది ప్రజలకు. అనంతరం అక్కడే సెల్లార్ లో ఉన్న రెండు షాపులను అద్దెకు తీసుకుని 'దోశ హౌస్' గా మార్చి, మొత్తం 403 రకాల 'దోశ' లను వేయడం నేర్చుకుని, అన్ని రకాల టీఫిన్లను అందిస్తున్నాడాయన. ఇందులో ఎస్ఎల్ఎన్ఎస్ స్పెషల్ దోశ, నందు స్పెషల్ దోశ, మలాయ్ మక్కడ్ దోశ, మిల్లెట్ దోశ, రాగి దోశ, జొన్న దోశ, 'ఘీ'దోశ, బట్టర్ కారం దోశ, క్రిస్పీ దోశ, శాండ్ విచ్ దోశ, వెజిటెబుల్ దోశలే కాకుండా, పిస్తా దోశ, ఐస్ క్రీం దోశ,బ్రెడ్ మంచూరియా దోశ, చాక్లెట్ దోశ, బట్టర్ ఆనియన్ దోశ, చైనీస్ దోశ, రోల్ దోశ, లెమన్ దోశ, క్యాప్సికం దోశ, బీట్ రూట్ దోశ,అటుకుల దోశ, పిజ్జా దోశ లాంటి 60 నుండి 70 రకాల వరకు స్పెషల్ దోశలను వేయడంలో ప్రావీణ్యం పొందాడు.

అంతే కాకుండా ఆర్గానిక్ టిఫిన్లు అయిన రాగి రొట్టె, జొన్న రొట్టె, మునగాకు రొట్టె, రాగి ఉప్మా, కొర్రల పొంగలి, సామల కడ్రయిస్, రాగి పాలు, రాగి సంకటి, పొంగనాలు, మిల్లెట్ ఇడ్లి, బట్టర్ ఇడ్లీ, ఉప్మా ఖిచ్డీ, లాంటి అనేక రకాల టిఫిన్స్ లను డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా తయారు చేసి అందించడం కూడా ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. నిత్యం 100 నుండి 150 మంది వరకు టిఫిన్ ప్రియులు వస్తారని, ధర కూడా చౌకగానే ఉంటుందని ఆయన వివరించారు. ఎందులోనూ చక్కెర వాడకుండా 'బ్రౌన్ బెల్లం' వాడనున్నట్లు తెలుపుతూ, టిఫిన్ ఆరగించాక పుదీనా ఆకులు వేసిన మంచి నీరును కూడా గ్లాసు జగ్గుల్లో అందుబాటులో ఉంచాడాయన. శుచి, శుభ్రతను పాటిస్తూ, ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా అమలు పరుస్తూ, టిఫిన్లు పార్సిల్ కావాలనుకునేవారు తమ వెంట టిఫిన్ బాక్స్ తెచ్చుకోవాలని బోర్డు రాసి పెట్టాడు."నచ్చకపోతే మాకు చెప్పండి - నచ్చితే బయట చెప్పండి" అనే కోటేషన్స్ లను హాస్య నటుడు బ్రహ్మనందం ఫోటోలతో పెట్టి కస్టమర్లను ఆకట్టుకుంటూ, వారి పట్ల మర్యాదగా వ్యవరిస్తూ, అడపా దడపా డబ్బులు మర్చిపోయి వచ్చిన వారికి, బిల్లు చెల్లించలేని వారికి, తర్వాత చెల్లించమని చెప్పి తన దాతృత్వాన్ని చాటుతుంటాడు ఆనంద్ కుమార్.

Advertisement

Next Story

Most Viewed